ఆసియా కప్-2023(asia cup 2023 news) టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జై షా అధ్యక్షతన జరిగిన ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023 వన్డే ప్రపంచకప్‌నకు(World Cup 2023 Host) సన్నాహకంగా ఈ టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. అయితే పాక్‌లో జరిగే ఈ టోర్నీకి భారత్ వెళుతుందా? వెళ్లదా? అన్న సందేహం అందరి మదిలోనూ మెదులుతోంది. ఈ నేపథ్యంలోనే పలు వ్యాఖ్యలు చేశారు పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా(ramiz raja news).
"ఆసియా కప్-2023 టోర్నీని గొప్పగా నిర్వహించాలని అనుకుంటున్నాం. అభిమానులూ అదే కోరుకుంటున్నారు. ఏసీసీలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలి. అన్ని బోర్డులతో సన్నిహితంగా ఉంటూ ఏసీసీని పటిష్టంగా తయారు చేయాలి. రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య మైత్రిబంధం మరింత బలమవ్వాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో చర్చించాను. రాజకీయాల నుంచి క్రికెట్‌ను దూరంగా ఉంచాలి. భారత్-పాక్ మధ్య సిరీస్ జరగాలంటే.. దాని వెనకాల చాలా పని జరగాలి. ప్రస్తుతానికి రెండు దేశాల బోర్డుల మధ్య జరిగిన చర్చలు సజావుగా సాగాయి."
-రమీజ్ రాజా, పీసీబీ ఛైర్మన్
నిజానికి గతేడాది పాక్‌లో ఆసియా కప్ ((asia cup 2023 news)) జరగాల్సింది. కానీ భద్రతా కారణాల రీత్యా టోర్నీని యూఏఈకి తరలించాలని బీసీసీఐ కోరింది. మధ్యలో కరోనా మహమ్మారి కారణంగా మొదట 2021కి ఆ తర్వాత 2022కి ఈ టోర్నీ వాయిదా పడింది. మొత్తానికి వచ్చే ఏడాది శ్రీలంకలో ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో జరపాలని నిర్ణయించారు. 2023 ఆసియా కప్ ఆతిథ్యం విషయంలో మాత్రం పాక్ పట్టు వదలట్లేదు. భారత్‌లో 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు (World Cup 2023 Host) సన్నాహకంగా ఈ ఆసియా కప్ నిర్వహించే అవకాశం ఉంది.
పాక్‌కు కష్టమేనా?
2008 ఆసియా కప్ తర్వాత పాక్‌లో ఇప్పటివరకూ ఒకటి కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న టోర్నీలు జరగలేదు. 2009లో పాక్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రదాడే అందుకు కారణం. ఇటీవల తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ చివరి నిమిషంలో న్యూజిలాండ్.. పాక్ పర్యటన రద్దు చేసుకుని స్వదేశం వెళ్లిపోయింది. ఇంగ్లాండ్ కూడా అదే బాటలో సాగింది. మరి రెండేళ్ల తర్వాత ఆసియా కప్ కోసం భారత్‌ను తమ దేశానికి పాక్ రప్పించగలదా అన్నది ప్రశ్న.