ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2022లో పాల్గొనే జట్లకు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సిరీస్‌లో తమ స్పిన్నర్ వనిందు హసరంగ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడన్నాడు.
"టీ20 బౌలింగ్‌లో హసరంగ దిట్ట. బ్యాటర్లకు బలమైన ప్రత్యర్థిగా నిలుస్తాడు. అతడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. గడిచిన మూడేళ్లలో ఈ కుర్రాడు అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. రానున్న ఆస్ట్రేలియన్ సిరీస్‌లో ఫింగర్ స్పిన్నర్లతో పోలిస్తే లెగ్ స్పిన్నర్లకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి" అని ముత్తయ్య వివరించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ కార్యక్రమంలో భాగంగా మురళీధరన్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా లంక జట్టు ఆటతీరుపై తానెంతో నమ్మకంగా ఉన్నట్టు తెలిపాడు.
ఇప్పటికే సూపర్-4లో వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన శ్రీలంక రానున్న ప్రపంచకప్ సిరీస్‌లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. తమ కుర్రాళ్లకు సామర్థ్యం ఉన్నా తుది రౌండ్‌కు ఎంపికవ్వాలంటే క్వాలిఫైయర్ రౌండ్ దాటాల్సి వస్తోందన్నాడు. గతంలో కొన్ని మ్యాచ్‌లలో సరిగా ఆడలేకపోయామని ఈసారి మాత్రం తామెంతో నమ్మకంగా ఉన్నామని తెలిపాడు. తనకన్నా షేన్ వార్న్ గొప్ప స్పిన్నర్ అంటూ కితాబిచ్చాడు. అతని ఆటతీరు చూసి చాలా నేర్చుకున్నానని, మనమంతా వార్న్‌లాంటి ఆటగాడిని చాలా మిస్సవుతామన్నాడు.
ఇదీ చూడండి: ఫెదరర్ ఆటలోనే కాదు సంపాదనలోనూ ముందే.. మొత్తం ఎన్ని వేల కోట్లంటే?