సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తన కలని మహిళా వికెట్‌కీపర్ ఇంద్రాణి రాయ్ తెలిపింది. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి సీనియర్లతో డ్రస్సింగ్ రూమ్ పంచుకోవడం సంతోషకరమని పేర్కొంది. ఎంఎస్ ధోనీ సలహాలు తనను మెరుగైన వికెట్‌కీపర్‌గా మార్చాయని వెల్లడించింది. త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు, వన్డే, టీ20 సిరీసుకు ఆమె ఎంపికైంది.
ఇంద్రాణిది పశ్చిమ్ బెంగాల్. అండర్-19, అండర్-23 వరకు అక్కడే ఆడింది. బ్యాటర్‌గా మాత్రమే కొనసాగింది. జట్టులో వికెట్ కీపర్లు ఎక్కువ మంది ఉండటం వల్ల 2018లో ఝార్ఖండ్‌కు మారింది. రాంచీలో సాధన చేస్తున్నప్పుడు ఆమె మహేంద్రసింగ్ ధోనీని చాలాసార్లు కలిసింది. వికెట్ కీపింగ్‌పై ఆమెకు మహీ ఎన్నో సలహాలు ఇచ్చాడు. తన చుట్టూ ఐదు మీటర్ల పరిధిలో ఎలా ఉండాలో అతడి నుంచి మెలకువలు నేర్చుకొంది.
'టెస్టు క్రికెట్ ఆడాలన్నది నా కల. మూడు ఫార్మాట్లకు ఎంపికవ్వడం వల్ల ఇప్పుడు నా కలకు చేరువయ్యాను. బెంగాల్‌కు ఆడేటప్పుడు కీపింగ్ చేసే అవకాశం రాలేదు. 2018లో విరామం తీసుకొని ఝార్ఖండ్‌కు మారాను. రాంచీ మైదానంలో సాధన చేసేటప్పుడు మహీ భాయ్ నాకు విలువైన సలహాలు ఇచ్చాడు. నా చుట్టూ ఐదు మీటర్ల పరిధిలో కదలికలను ఆయన వల్లే మెరుగు పర్చుకున్నా. నేనెప్పుడూ ఆయన ఆటను పరిశీలిస్తుంటాను' అని ఇంద్రాణి తెలిపింది.
మగ పిల్లలతో కలిసి తానెప్పుడూ సాధన చేస్తానని ఇంద్రాణి చెప్పింది. వారి ప్రమాణాలను అందుకొనేందుకు ప్రయత్నించడం తనకు సాయపడిందని పేర్కొంది. బాగా కష్టపడేందుకు తన తల్లి స్ఫూర్తినిచ్చిందని వెల్లడించింది. ఝార్ఖండ్ జట్టులో ఎదిగేందుకు సీమా సింగ్ సాయం చేసిందని తెలిపింది. టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడాన్ని ప్రస్తుతం ఆస్వాదిస్తున్నానని, మిథాలీ, జులన్‌తో డ్రస్సింగ్ రూమ్ పంచుకోవడం గొప్ప సందర్భమని వివరించింది.