Ravindra jadeja csk captain: ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సత్తా ఏంటో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి తెలుసని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప అన్నాడు. అందుకే ధోని తన రిటైర్మెంట్ తర్వాత చెన్నై పగ్గాలను జడేజాకే అప్పగిస్తాడని అనుకుంటున్నానని పేర్కొన్నాడు! జడేజాకు మార్గం సుగమం చేస్తూ ధోని.. తనకు తానే రెండో ప్రాధాన్య ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడని తెలిపాడు. మరోవైపు ఇటీవల సీఎస్కే సమర్పించిన అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో రవీంద్ర జడేజాను మొదటి ప్రాధాన్య ఆటగాడిగా ఎంచుకోవడం.. ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల ధోని కూడా తన చివరి మ్యాచ్ చెన్నైలోనే ఆడతానని ప్రకటించడం గమనార్హం.
"ధోని కావాలనే రెండో ప్రాధాన్య ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. జట్టులో జడేజా సత్తా ఏంటో అతడికి బాగా తెలుసు. ధోని నిష్క్రమణ తర్వాత జడేజాకే పగ్గాలు అప్పగిస్తాడనుకుంటున్నాను" అని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను మరో మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కూడా సమర్థించాడు. 'చెన్నై జట్టు తర్వాతి కెప్టెన్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు జడేజాలో ఉన్నాయి. అతడో గొప్ప ఆటగాడు. టెస్టు క్రికెట్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. వన్డే క్రికెట్లో కూడా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి దిగి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అందుకే, ధోని తర్వాతి కెప్టెన్‌గా జడేజానే సరైనోడనిపిస్తోంది' అని పార్థివ్ పటేల్ అన్నాడు.
ఇటీవల సీఎస్కే యాజమాన్యం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), ధోని (12 కోట్లు), మొయీన్ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్ (రూ. 6 కోట్లు)లను రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ద్వారా యాజమాన్యం కూడా ధోని తర్వాతి కెప్టెన్ ఎవరో చెప్పకనే చెప్పినట్లయింది!
ఇదీ చూడండి: CSK Dhoni retain: 'మహీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు'