బెంగళూరులో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ(Dhoni Cricket Academy) ప్రారంభమైంది. గేమ్ ప్లే, ఆర్కా స్పోర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ అకాడమీ ఏర్పాటు చేశాయి. బెంగళూరులోని బిదరహల్లిలో ఏర్పాటు చేసిన ఎంఎస్ ధోనీ అకాడమీలో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని నిర్వాహకులు పేర్కొన్నారు. నవంబర్ 7 నుంచి అకాడమీలో శిక్షణ ప్రారంభించనున్నారు. ఐపీఎల్ 2021 కోసం యూఏఈలో ఉన్న టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(Dhoni News).. అకాడమీ ప్రారంభం సందర్భంగా యువ క్రికెటర్లకు ఓ సందేశం పంపాడు.
"క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. యువ క్రికెటర్లకు 360 డిగ్రీలలో శిక్షణ ఇప్పించడమే గాక మంచి టెక్నిక్స్, టెక్నాలజీతో మీ నైపుణ్యాలకు మెరుగులుదిద్దడమే మా ప్రధాన ఉద్దేశం. సుశిక్షితులైన కోచింగ్ బృందం మీకు అన్నివిధాలుగా అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది. వెంటనే రిజిస్టర్ చేసుకుని మా అకాడమీలో భాగస్వాములవ్వండి."
- ఎంఎస్ ధోనీ, టీమ్ఇండియా మాజీ కెప్టెన్
ఈ సందర్భంగా యువ క్రికెటర్లందరికీ ధోనీ ఓ సలహా కూడా ఇచ్చాడు. ఫలితం కంటే దాని కోసం చేసే ప్రయత్నం చాలా గొప్పదన్నాడు. చిన్న చిన్న విషయాల మీద అవగాహన పెంచుకోవాలన్నాడు. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సక్సెస్ అవుతామని మహీ వివరించాడు. మరోవైపు, ఐపీఎల్‌లో ధోనీ(CSK Captain Dhoni) సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో టైటిల్‌పై కన్నేసింది. క్వాలిఫయర్-1లో(IPL 2021 Qualifier 1) దిల్లీ క్యాపిటల్స్‌పై(CSK Vs DC) నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకుంది. మరి ఈ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో లేదో చూడాలి.
ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్ భారత జట్టులో మార్పులు.. శార్దూల్‌కు చోటు