Shami about his Father: తన తండ్రి చేసిన త్యాగాల వల్లే ఈ రోజు ఈ స్థాయికి రాగలిగానని టీమ్‌ఇండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు అతడు ఐదు వికెట్లతో అదరగొట్టాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో షమీ మరో అరుదైన మైలు రాయిని కూడా చేరుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన మూడో (55వ టెస్టు) భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇతని కంటే ముందు మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్ (50 టెస్టులు), జవగళ్ శ్రీనాథ్ (54 టెస్టులు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించాడు షమీ.
"నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ప్రధాన కారణం మా నాన్న. ఉత్తర ప్రదేశ్‌లో మాదో మారుమూల గ్రామం. కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు. దీంతో మా నాన్న రోజు నన్ను 30 కి.మీ. సైకిల్‌పై అకాడమీకి తీసుకెళ్లేవాడు. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా నాపై నమ్మకంతో ప్రోత్సహించాడు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. టెస్టు క్రికెట్ అంటే రాకెట్ సైన్స్ కాదు. టెస్టుల్లో.. పిచ్ పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ బంతులేయాలనే విషయంపై అవగాహన ఉండాలి. అందుకు వీలైనంత ఎక్కువగా శ్రమించాలి. కష్టపడితే ఫలితాలు వాటంతటవే వస్తాయి" అని షమీ చెప్పాడు.