Mithali Raj retirement: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అటకు వీడ్కోలు పలకబోతున్నట్లు తెలిపింది. త్వరలో జరగబోయే వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపింది. టాలెంట్ కలిగిన ఆటగాళ్లతో జట్టు మరింత బలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
"నేను ఈ టోర్నమెంట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాను. ఆ తర్వాత కొత్త టాలెంట్ కలిగిన ఆటగాళ్ల రాకతో జట్టు మరింత బలంగా తయారవుతుంది."
-మిథాలీ రాజ్
న్యూజిలాండ్తో 5 వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన చివరి వన్డే అనంతరం ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సిరీస్లో భారత్ 4-1 తేడాతో పరాజయం పాలైంది. ఎట్టకేలకు ఐదో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు స్మృతి మంధానకు వరించింది.
మిథాలీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 222 వన్డేలు ఆడి 51.8 సగటుతో 7,516 పరుగులు సాధించింది. ఇందులో 7 సెంచరీలు, 61 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో ఆమె అత్యధిక స్కోరు 125 నాటౌట్. టెస్టుల్లో 12 మ్యాచ్‌లు ఆడి 43.7 సగటుతో 699 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో ఆమె అత్యధిక స్కోరు 214 పరుగులు. 89 టీ20 మ్యాచులాడిన ఆమె 37.52 సగటుతో 2,364 పరుగులు సాధించింది. ఇందులో 17 అర్థ శతకాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: ఐసీసీ మహిళా క్రికెట్ ర్యాంకింగ్స్: మిథాలీ రాజ్@2