Mike Hussey on Ashes: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. సిడ్నీ వేదికగా చివరిరోజు ఇంగ్లాండ్ మరో 358 పరుగులు చేస్తే ఆసీస్‌పై ఈ సిరీస్‌లో తొలి విజయం నమోదు చేస్తుంది. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు సిడ్నీలో టీమ్ఇండియా సూపర్ ఇన్నింగ్స్‌ను ఆదర్శంగా తీసుకోవాలని వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మైక్ హస్సీ.
"టెస్టు క్రికెట్లో ఇదే గొప్ప విషయం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. గతేడాది భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా చాలా మంది ఆటగాళ్లకు గాయాలయ్యాయి. కానీ, టీమ్ఇండియా ఆటగాళ్లు పూర్తి విశ్వాసంతో ఆడి సిడ్నీ మ్యాచ్ డ్రా చేశారు. గబ్బాలో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకున్నారు. ఇంగ్లాండ్ వారిని ఆదర్శంగా తీసుకోవాలి."
--మైక్ హస్సీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.
సిడ్నీ వేదికగా గతేడాది జరిగిన భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌లో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్.. ఆస్ట్రేలియాకు అడ్డుగోడగా నిలిచారు. చివరివరకు వికెట్ కాపాడి మ్యాచ్ డ్రా అయ్యేలా చేశారు. ఈ మ్యాచ్‌ను ఉద్దేశిస్తూ హస్సీ.. ఇంగ్లాండ్ జట్టుపై పలు వ్యాఖ్యలు చేశాడు.
నాలుగో టెస్టు ఇలా..
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల నష్టానికి 416 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 294 పరుగులకే ఆలౌట్ చేసింది కంగారూ జట్టు.
రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు నష్టానికి 265 పరుగులు చేసి మళ్లీ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా.. 388 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఆసీస్ బ్యాటర్ ఖవాజా సెంచరీతో సత్తా చాటాడు. చివరిరోజు ఆస్ట్రేలియా దుర్భేద్య బౌలింగ్‌ను తట్టుకుని ఇంగ్లీష్ బ్యాటర్లు పోరాడితే రూట్‌సేన విజయం సాధించవచ్చు. లేదా డ్రా కోసమైనా పోరాడవచ్చు.
ఇదీ చదవండి:
ఖవాజా మరో సెంచరీ.. చివరి రోజు ఇంగ్లాండ్‌కు సవాలే!