IND vs NZ 2nd Test: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య డిసెంబరు 3 నుంచి జరగనున్న రెండో టెస్టు కోసం.. తుది జట్టు కూర్పులో పలు మార్పులు చేయాలని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు దీప్‌దాస్ గుప్తా సూచించాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో.. మహమ్మద్ సిరాజ్‌కు అవకాశమివ్వాలని పేర్కొన్నాడు.
"ముంబయిలో జరుగనున్న రెండో టెస్టుకు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. అలాగే, తొలి టెస్టులో ఓపెనింగ్ చేసిన మయాంక్ అగర్వాల్‌ను.. మూడో స్థానంలో బ్యాటింగ్ పంపించాలి. ఎందుకంటే ఉపఖండ పిచ్‌లపై అతడు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టగలడు. అలాగే మిడిలార్డర్‌లో తీవ్రమైన పోటీ ఉంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఈ టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నారు. కాబట్టి, శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. సీనియర్లు జట్టులోకి వస్తే అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ దిగాలి అనే విషయంలో గందరగోళం నెలకొంది. అందుకే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గిల్‌ను ఇప్పటి నుంచే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు పంపించాలి. కాగా, అరంగేట్ర ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి దిగి శతకంతో ఆకట్టుకున్నాడు. కాబట్టి, మిడిలార్డర్‌లో అతడి స్థానం పదిలమైనట్లే" అని దీప్‌దాస్ గుప్తా పేర్కొన్నాడు.
ముంబయి వాంఖడే వేదికగా జరగనున్న రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులోకి రానున్నాడు. దీంతో తుదిజట్టులో కోహ్లీ స్థానంలో ఎవరిని పక్కనపెట్టాలనే విషయంలో డైలామాలో పడింది యాజమాన్యం. తొలి టెస్టు కెప్టెన్‌గా చేసిన రహానే, పుజారాలలో ఎవరో ఒకరిని పక్కనపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.