Lasith Malinga Returns To MI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు తమ జట్లలో కీలక మార్పులు చేస్తున్నాయి. ఇప్పటికే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమతమ హెడ్‌కోచ్‌లను మార్చేశాయి. ఆయితే ఇప్పుడు ముంబయి ఇండియన్స్ కూడా తమ జట్టులో కీలక మార్పు చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం. అదేంటంటే..
శ్రీలంక వెటరన్, స్టార్ పేస్ బౌలర్ లసిత్ మలింగ.. తిరిగి ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 2024 ఐపీఎల్ సీజన్లో మలింగ ముంబయి జట్టుకు బౌలింగ్ కోచ్‌గా రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముంబయి మేనేజ్మెంట్ ప్రస్తుతం కోచ్‌గా ఉన్నషేన్ బాండ్‌కు ఉద్వాసన పలికి.. మలింగకు ఆ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై ముంబయి ఫ్రాంచైజీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Lasith Malinga IPL Career : అయితే మలింగ ఐపీఎల్లో 2008-2019 సీజన్లలో ముంబయి జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగాడు. కాగా అతడు ముంబయి ఛాంపియన్‌గా నిలిచిన ఐదు సార్లు జట్టులో కీలకంగా వ్యవహరించాడు. అందులో నాలుగు ఐపీఎల్ (2013,2015,2017,2019), సహా ఒక ఛాంపియన్స్ లీగ్ (2011) ఉన్నాయి. మలింగ ముంబయి తరఫున 139 మ్యాచ్‌లు ఆడి.. 170 వికెట్లు పడగొట్టాడు. ఇక మలింగ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వెళ్లాడు. మరోవైపు బౌలింగ్ కోచ్‌గా ఉన్న షేన్ బాండ్ 2015లో ముంబయి జట్టులో చేరాడు. అతడు సుదీర్ఘంగా ఎనిమిదేళ్లుగా ముంబయి ఫ్రాంచైజీతో ఉన్నాడు.
Mumbai Indians IPL Trophies : ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ అత్యంత సక్సెస్ఫుల్ జట్లలో ఒకటి. 16 సీజన్లలో ఈ జట్టు ఇప్పటికే 5 టైటిళ్లను కైవసం చేసుకొని టాప్‌లో ఉంది. అయితే 2023 సీజన్లో మొదట పేలవంగా ఆడినా.. ఆపై పుంజుకొని క్వాలిఫయర్స్‌లోకి దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి.. ఇంటి బాట పట్టింది.