Kohli injury update: వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు దూరమైన సారథి కోహ్లీ కోలుకుంటున్నాడని తెలిపాడు టీమ్ఇండియా బ్యాటర్ పుజారా. త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"అధికారికంగా నేనేమి చెప్పలేను కానీ అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని భావిస్తున్నా. విరాట్ ఇప్పుడు ఎలా ఉన్నాడనేది ఫిజియోలే చెప్పాలి" అని పుజారా అన్నాడు.
గత కొద్దికాలంగా పుజారా, రహానె ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో సరిగ్గా రాణించలేకపోతే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశాడు. 'ఈ వ్యాఖ్యలు మీపై ఒత్తిడి చూపాయా' అని అడిగిన ప్రశ్నకు పుజారా స్పందిస్తూ... "మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. టీమ్మేనేజ్మెంట్, కెప్టెన్, కోచింగ్ బృందం నుంచి మాకు మద్దతు, ప్రోత్సాహం ఉంది. ఆటగాళ్లకు వారి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సన్నీ భాయ్ నుంచి ఎప్పడూ నేర్చుకుంటూనే ఉన్నాం. ఆయనెప్పుడూ మాకు అండగానే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఎన్నో ప్రశ్నలు ఎదురౌతాయి. కానీ మేము ఆత్మవిశ్వాసంతోనే ఉంటాం. నేను, రహానె ఎంతో కష్టపడతామో మాకు తెలుసు. ఫామ్ అనేది తాత్కాలికం కానీ క్లాస్ శాస్వతం. అదే నిజం." అని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: 'కోహ్లీ వందో టెస్టుకు అలా జరగాలని ఆశిస్తున్నా'