kohli century placard: రెండున్నరేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు నిరాశే మిగిలింది. మొహలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో అతడు 45 పరుగులకే ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ 44వ ఓవర్లో లంక స్పిన్నర్ ఎంబుల్దేనియా వేసిన బంతికి క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 2019లో ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీ తన చివరి సెంచరీని సాధించాడు.
అయితే మొదటి టెస్టు రెండో రోజు స్టేడియంలో ఒక ఆసక్తికరమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ అభిమాని చేతిలో పట్టుకున్న ప్లకార్డును చూసి అంతా ఆశ్చర్యపోయారు. 'కోహ్లీ 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించే వరకు పెళ్లి చేసుకోను' అని ఆ అభిమాని ప్లకార్డులో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ 70 సెంచరీలతో 3వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ తెందుల్కర్ (100), రికీ పాంటింగ్ (71) సెంచరీలతో కోహ్లీ కంటే ముందున్నారు.
ఇదీ చదవండి: బౌన్సర్లను నిషేధించాల్సిన అవసరం లేదు: ఎంసీసీ