పేలవ ఫామ్‌తో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పలువురు క్రికెటర్లు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా కోహ్లీకి మద్దతు తెలిపేవారి జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్విటర్‌లో ''ధైర్యంగా ఉండు'' అనే సందేశాన్ని పంచుకోగా, దానికి విరాట్ కోహ్లీ సమాధానం ఇచ్చాడు. 'ధన్యవాదాలు. నిరంతరం రాణిస్తూ, మరింత పైకి ఎదగాలి. నీకు ఆల్ ది బెస్ట్' అంటూ చప్పట్లు కొడుతున్న ఇమోజీని జోడించాడు. బాబర్ ట్వీట్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తుండగా, ఇప్పుడు విరాట్ ఆ ట్వీట్‌కు సమాధానం ఇవ్వటంతో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
అంతకుముందు బాబర్ అజామ్ మాట్లాడుతూ.. ''ఓ ఆటగాడిగా ఫామ్ కోల్పోవడం నాకు బాగా తెలుసు. ఆ దశను ప్రతి ప్లేయర్ ఎదుర్కొంటాడు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరి మద్దతు అవసరం. అందుకే కోహ్లీకి మద్దతుగా ట్వీట్ చేశా. ప్రపంచ క్రికెట్‌లో అతడొక అత్యుత్తమ ఆటగాడు. ఇప్పటికే చాలా ఏళ్లపాటు క్రికెట్ ఆడాడు. ఇటువంటి కఠిన పరిస్థితుల నుంచి బయటకు ఎలా రావాలో విరాట్‌కు బాగా తెలుసు. అయితే దీనికి కొంత సమయం పడుతుంది. ఫామ్‌లోకి వస్తే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరమూ కాదు. ఇది ఆటకు కూడా చాలా మంచిది'' అని బాబర్ వివరించాడు. 2019 తర్వాత కోహ్లీ ఒక్కసారి కూడా మూడంకెల స్కోరు చేయలేదు. బ్యాటర్‌గానూ ఆటలో విఫలవుతున్నాడు. దీంతో కోహ్లీని టీమ్ ఇండియాలో కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, త్వరలో జరగబోయే వెస్టిండీస్ సిరీస్‌కూ సెలక్టర్లు కోహ్లీని ఎంపిక చేయలేదు.
ఇదీ చదవండి: 3rd ODI: కీలక సమరానికి భారత్-ఇంగ్లాండ్ సిద్ధం.. గెలుపెవరిది?