ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కని బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ హాకీ స్టిక్ పట్టింది. ముంబయిలో వెల్లింగ్డన్ కాథోలిక్ జింఖానా రింక్ హాకీ టోర్నీలో అంకుల్స్ కిచెన్ యునైటెడ్ స్పోర్ట్స్ జట్టుకు జెమీమా ఆడనుంది. హాకీ స్టిక్‌తో చక్కగా డ్రిబ్లింగ్ చేస్తున్న దృశ్యాల్ని సామాజిక మాధ్యమం వేదికగా బుధవారం జెమీమా పోస్ట్ చేసింది.
ఆమె హాకీ నైపుణ్యంపై భారత హాకీ జట్టు మాజీ గోల్‌కీపర్ ఆడ్రియన్ డిసౌజా ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా ఉన్నా కూడా జెమీమా హాకీని మరిచిపోలేదని చెప్పాడు.
21 ఏళ్ల జెమీమా.. ఇప్పటి వరకు 21 వన్డేలు, 50 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. క్రికెట్‌తో పాటు హాకీపైనా ముందు నుంచే జెమీమా ఇష్టముంది. తొమ్మిదేళ్ల వయసులో ఆమె మహారాష్ట్ర అండర్-17 హాకీ జట్టులో చోటు సంపాదించింది. ముంబయి అంతర్ పాఠశాలల లీగ్‌లలో బరిలో దిగింది. ప్రస్తుతం ఈనెల 11 నుంచి 16 వరకు జరిగే టోర్నీ కోసం జెమీమా సన్నద్ధమవుతోంది.
ఇవీ చదవండి: