Jasprit Bumrah Fitness : భారత జట్టులోని పలువురు క్రికెటర్లు ఇటీవలే గాయాల బారిన పడి ఆటకు దూరమైన నేపథ్యంలో వీరికి సంబంధించి ఓ శుభవార్త వినిపించింది బీసీసీఐ. గత కొద్దిరోజులుగా వెన్ను నొప్పి గాయంతో బాధపడుతున్న టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా క్రమంగా కోలుకుంటున్నట్లు బీసీసీఐ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న అతడు నేషనల్ క్రికెట్ అకాడమి (ఎన్‌సీఏ) ఆధ్వర్యంలోని రీహాబిలిటేషన్ కేంద్రంలో ఉంటూ ఆటకు సిద్ధమవుతున్నాడట. ఈ క్రమంలో తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు అతడు వరుసగా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఏడు ఓవర్ల బౌలింగ్ వేసి అందర్ని ఆశ్చర్యనికి గురిచేసినట్లు సమాచారం అందింది.
"జట్టులోని ప్రధాన బౌలర్ గాయం నుంచి కోలుకోవడం అంత సులువైన అంశం కాదు. మేము బుమ్రా విషయంలో నిత్యం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అతడిని పర్యవేక్షిస్తున్నాము. అతడు వేగంగా కోలుకోవడమే కాకుండా తన ఫిట్‌నెస్‌ను కూడా మెరుగుపరుచుకుంటున్నాడు. నెట్స్‌లో అతడు ఏ మత్రం తడబాటుకు లోనవ్వకుండా వరుసగా ఏడు ఓవర్ల బౌలింగ్ వేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. క్రమంగా అతడు మరిన్ని ఓవర్లు వేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. వచ్చే నెలలో అతడు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అక్కడ ఎలా ఆడతాడో గమనించాక బుమ్రా ఫిట్‌నెస్‌పై ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే అతడు ఆగస్టులో ఐర్లాండ్‌తో జరిగే వన్డేలో ఆడతాడో లేదో అనే దానిపై ఓ అంచనాకు రాగలం."
- బీసీసీఐ అధికార ప్రతినిధి
అప్పుడే ఒక అంచనాకు..
ICC World Cup 2023 : ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచకప్‌కు మరో 99 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ మహా సమరం ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టు ఆటగాళ్లను సెలెక్ట్ చేసే పనిలో పడింది బీసీసీఐ. అయితే ఈ ప్రపంచకప్ పోరుకు ముందు భారత్ వరుసగా విండీస్ వన్డే టూర్‌తో పాటు ఐర్లాండ్‌తో కూడా టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ టోర్నీల్లో ఆటగాళ్లు కనబరిచే ప్రతిభ ఆధారంగా ఐసీసీ వరల్డ్‌కప్ తుది జట్టు ఎంపికపై ఓ అంచనాకు రానున్నారు సెలక్టర్లు.
ఐర్లాండ్‌తో ఆడాకే..
India Injured Players : ఇక జస్ప్రీత్ బుమ్రాతో పాటు గాయాల కారణంగా ఆటకు దూరమైన ఇతర ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లు కూడా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఆడాలనే ఉద్దేశంతో త్వరగా కోలుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు వీరంతా ఎన్‌సీఏ అకాడమీలోని రీహాబిలిటేషన్ సెంటర్‌లో వేగంగా కోలుకుంటున్నారు. వీరందరినీ ఆగస్టులో జరిగే ఆసియా కప్ నాటికి సిద్ధం చేసి ఆపై వన్డే ప్రపంచకప్‌కు పంపాలని భావిస్తోంది బీసీసీఐ.