Ishan kishan: భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇండియా తరఫున టీ20లో ఒక మ్యాచులో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ పేరిట ఈ రికార్డును శ్రీలంకతో జరిగిన టీ20లో 56 బంతుల్లో 89 పరుగులతో బ్రేక్ చేశాడు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కేఎల్ రాహుల్‌లను సైతం వెనక్కునెట్టాడు. వికెట్ కీపర్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో పంత్ 65, రాహుల్ 57, ధోనీ 56 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు రిషబ్ పంత్‌కు విశ్రాంతినివ్వగా, కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మెుదటి వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఇషాన్. రోహిత్ 32 బంతుల్లో 44 పరుగులు చేశాడు.
శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచులో భారత్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమైంది. చరిత్ అసలంక (47 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు.
ఇదీ చదవండి: లంకపై భారత్ గెలుపు.. బ్యాటర్‌గా రోహిత్ సరికొత్త రికార్డు