శ్రీలంకలో భారత జట్టు పర్యటనపై కొవిడ్ మబ్బులు కమ్ముకుంటున్నాయి! రెండు జట్ల మధ్య జరగాల్సిన మూడు వన్డేలు, మూడు టీ20లపై సందిగ్ధం ఏర్పడింది. లంకలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం.
శ్రీలంకలో గురువారం 3,269 కరోనా కేసులు రాగా 24 మంది చనిపోయారు. గత ఏడు రోజుల్లో కేసుల సంఖ్య మొత్తం 16,343, మరణాలు 147కు చేరుకున్నాయి. మెల్లగా కరోనా రెండో వేవ్ ప్రభావం అక్కడ పెరుగుతోంది. వైరస్ కారణంగా గతేడాది జరగాల్సిన శ్రీలంక-భారత్ సిరీసును ఇప్పటికే వాయిదా వేశారు.
"పెరుగుతున్న కొవిడ్-19 కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ గతేడాది కరోనా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్, ఇతర సిరీసులను విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌నూ అలాగే నిర్వహిస్తామన్న నమ్మకం ఉంది. ఏదేమైనా కేసులు పెరగకూడదని కోరుకుంటున్నాం"
-శ్రీలంక క్రికెట్ సీనియర్ అధికారి.
మరికొన్ని రోజుల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి వంటి సీనియర్లతో కూడిన భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. అక్కడ న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసు ఆడనుంది. అదే సమయంలో శ్రీలంకలో మరో బృందం పర్యటిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశారు. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్, యూజీ, సంజు, పృథ్వీషా, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాతియా వంటి కుర్రాళ్లతో కూడిన జట్టు లంకకు వెళ్లనుంది.
ఇదీ చూడండి: మూడుసార్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్.. నెగెటివ్ వస్తేనే ఇంగ్లాండ్‌కు..