టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దిగ్గజ బౌలర్లను అధిగమించి టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడం తీసి చహల్.. టీ20ల్లో 300 వికెట్లతో పాటు ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన మలింగ రికార్డును కూడా సమం చేశాడు. టీ20ల్లో భారత్ స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్ వంటి దిగ్గజ బౌలర్లు కూడా చహల్ తర్వాతే ఉన్నారు.
ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చహల్.. నాలుగు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులే ఇచ్చాడు. గత సీజన్లో చహల్.. 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆదివారం మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడంతో చహల్.. టీ20ల్లో 300 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఫ్రాంచైజీ క్రికెట్ జోరు కొనసాగుతున్న వేళ.. పలు లీగ్‌లతో పాటు దేశానికి ఆడుతూ అత్యధిక వికెట్లు తీసిన వారిలో వెస్టిండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో నిలిచాడు. బ్రావో.. 558 మ్యాచ్‌లలో 615 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో బ్రావో తర్వాత అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (530), కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ (479), ఇమ్రాన్ తాహిర్ (469), షకీబ్ అల్ హసన్ (451) ఉన్నారు. చహల్.. మొత్తంగా 265 మ్యాచ్‌లలో 303 వికెట్లు పడగొట్టి 15వ స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున టీ20 ఫార్మాట్లో 300 వికెట్లు తీసిన తొలి బౌలర్ చహలే. అతడి తర్వాత అశ్విన్ (287), పీయూశ్ చావ్లా (276), అమిత్ మిశ్రా (276), బుమ్రా (256) ఉన్నారు.
మలింగ రికార్డు సమం..
సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా చహల్.. ఐపీఎల్లో అతడి వికెట్ల సంఖ్య 170కు చేరింది. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అగ్రస్థానంలో ఉన్న భారత బౌలర్ అమిత్ మిశ్రా (166)ను అధిగమించిన చహల్.. లసిత్ మలింగ 170 వికెట్ల రికార్డును సమం చేశాడు. మలింగ ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతూ 122 మ్యాచ్‌లలో 170 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బౌలర్ కూడా డ్వేన్ బ్రావోనే కావడం గమనార్హం. బ్రావో 161 మ్యాచ్‌లలో 183 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో రాజస్థాన్ లీగ్ దశలోనే మరో 13 మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో బ్రావో రికార్డును చెరిపేయడం చహల్‌కు పెద్ద కష్టమేమీ కాదు!