టీమ్‌ఇండియా స్పిన్నర్, ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌పై(Ashwin News) భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Manjrekar on Ashwin) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ టీ20 క్రికెట్‌కు అనర్హుడని, ఈ పొట్టి ఫార్మాట్‌లో అతడికి వికెట్లు తీసే సామర్థ్యమే లేదని వ్యాఖ్యానించాడు. తానైతే అతడిని జట్టులోకే తీసుకోనని, గత ఐదారేళ్లుగా అతడు ప్రాతినిధ్యం వహించిన ప్రతి జట్టుకు భారంగానే ఉన్నాడంటూ మంజ్రేకర్(Sanjay Manjrekar on Ashwin) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
'మేం అశ్విన్ గురించి మాట్లాడి ఇప్పటికే చాలా సమయం వృథా చేశాం. టీ20ల్లో అశ్విన్ ఏ జట్టుకీ కీలకమైన బౌలర్ కాదు. మీరు అతడు మారాలని అనుకుంటే, అది జరుగుతుందని నేను అనుకోను. గత ఐదారేళ్లుగా అతడు ప్రాతినిధ్యం వహించిన ప్రతి జట్టుకు భారంగానే ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో అశ్విన్ వికెట్లు తీయలేడు. నేనైతే అశ్విన్‌ని నా జట్టులోకి తీసుకోను. టెస్టుల్లో అతడు అద్భుతమైన బౌలర్. కానీ, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకపోవడం విడ్డూరం' అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్-14 సీజన్‌లో(IPL 2021) భాగంగా బుధవారం దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల(DC vs KKR 2021) క్వాలిఫయర్-2 జరిగింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్‌కు వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 7 పరుగులు అవసరం కాగా.. అశ్విన్ బౌలింగ్ చేశాడు. తొలి రెండు బంతుల్లో ఒక పరుగే ఇచ్చాడు. మూడో బంతికి షకిబ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. నాలుగో బంతికి నరైన్ భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్‌లో అక్షర్‌కు చిక్కాడు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఐదో బంతికి త్రిపాఠి సిక్స్ బాదడంతో కేకేఆర్ మూడోసారి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది.
ఇదీ చదవండి:'అశ్విన్‌ను తిట్టిన ధోనీ.. ఎందుకంటే?'