టిమ్‌డేవిడ్ క్రీజులో ఉన్నంతవరకు తాము మ్యాచ్‌లో ఉన్నామని అనుకున్నానని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 194 పరుగుల భారీ ఛేదనలో ముంబయి కేవలం 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. చివరిబంతి వరకూ పోరాడిన రోహిత్‌సేన విజయపుటంచుల దాకా వెళ్లి బోల్తాపడింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ టిమ్‌డేవిడ్ రనౌట్ దురదృష్టకరమని అభిప్రాయపడ్డాడు.
'18వ ఓవర్ దాకా మ్యాచ్ మాదే అనుకున్నాం. కానీ, డేవిడ్ రనౌట్ దురదృష్టకరం. అప్పటి వరకు మేం గెలుస్తామనే నమ్మకంతో ఉన్నా. హైదరాబాద్ జట్టుకు అభినందనలు. వాళ్లకు పూర్తి క్రెడిట్ దక్కుతుంది. చివరివరకూ ఊపిరిబిగబట్టి ఆడారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మా జట్టులో కొంతమంది యువకులతో ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో బౌలింగ్ చేయించాలనుకున్నాం. అందుకే ప్రయోగాలు చేశాం. అయితే, హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ బాగా ఆడారు. దీంతో మా బౌలింగ్ తడబడింది. బ్యాట్‌తో రాణించి చివరివరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లినా గెలుపొందలేకపోయాం. ఇకపై ఆడాల్సిన చివరి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి విజయంతో ముగించాలనుకుంటున్నాం. వీలైతే కొంతమంది యువకులకు ఆడే అవకాశం కల్పిస్తాం' అని రోహిత్ పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ యువకులకు అవకాశం కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో.. సచిన్ కొడుకు అర్జున్ తర్వాతి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. గత రెండు సీజన్లలో సచిన్ కుమారుడికి ఆడే అవకాశం రాలేదు. అతడిని బెంచ్ పరిమితం చేశారు. నామమాత్రంగా ఆడే చివరి మ్యాచ్‌లో అర్జున్‌కు అవకాశం కల్పించడం వల్ల.. అతడు ఐపీఎల్లో అరంగేట్రం చేసినట్లు అవుతుందని ముంబయి యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'బ్యాడ్మింటన్‌లో ఇక భారత్ సూపర్ పవర్'