Rohit Sharma: ఐపీఎల్ 2022లో వరుసగా ఎనిమిదో ఓటమిని మూటగట్టుకోవడంపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యాడు. దారుణమైన బ్యాటింగ్ వల్లే తమ జట్టు విఫలమైందని అంగీకరించాడు హిట్‌మ్యాన్. ఆదివారం లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు.
" ఈ గేమ్‌లో మేము బాగానే బౌలింగ్ చేసినా బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. బ్యాటింగ్ చేసేందుకు ఈ పిచ్ బాగుంది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సింది. కానీ, అందుకు తగ్గట్టు ఆడలేకపోయాం. పూర్తిగా విఫలమయ్యాం. స్కోర్ బోర్డుపై ఆ మాత్రం లక్ష్యం ఉంటే మంచి భాగస్వామ్యాలు కావాలి. మేం వాటిని నిర్మించలేకపోయాం. నాతో సహా పలువురు బ్యాట్స్‌మెన్ బాధ్యతారాహిత్యమైన షాట్లు ఆడారు. ఈ సీజన్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాం. ఇతర జట్ల ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. ఆ విషయం మమ్మల్ని మరింత బాధించింది. నాకు జట్టులో పెద్దగా మార్పులు చేయడం ఇష్టం ఉండదు. తుది జట్టులో ఎవరికి అవకాశం ఇచ్చినా బాగా ఆడాలనే అనుకుంటాం."
-రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్
కాగా, ఆదివారం లఖ్‌నవూతో ఆడిన మ్యాచ్‌లో ముంబయి జట్టు 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చివరికి 132/8 పరుగులకే పరిమితమై 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్ రోహిత్ (39), తిలక్ వర్మ (38) టాప్‌స్కోరర్లుగా నిలిచారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం చేతులెత్తేశారు. ఈ ఓటమితో ముంబయి ప్లేఆఫ్స్ అవకాశాలు మొత్తం మూసుకుపోయినట్లే.
ఇదీ చూడండి: రాతమారని ముంబయి.. ఎనిమిదో ఓటమితో టోర్నీ నుంచి ఔట్