Virat kohli IPL 2023 strike rate : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఫస్టాఫ్ కూడా పూర్తై సెకండాఫ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ప్లేఆప్స్‌కు చేరాలంటే.. ఇప్పటి నుంచి అన్ని జట్లకు ప్రతి మ్యాచ్ కీలకమే. దీంతో గెలుపే లక్ష్యంగా ఆయా జట్లు తమ మెదళ్లకు మరింతగా పదును పెడుతూ వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్లేఆప్స్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరికాసేపట్లో ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. అయితే ఇదే సమయంలో మరోవైపు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై పెద్ద చర్చే నడుస్తోంది.
అయితే ఈ సీజన్‌లో కోహ్లీ పరుగులు చేస్తూ హాఫ్ సెంచరీలతో రాణిస్తున్నప్పటికీ.. అతడి స్ట్రైక్ రేట్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా చెప్పాలంటే మిడిల్ ఓవర్లలో లేదు. ఈ నేపథ్యంలో హోం గ్రౌండ్లో, బయటి మైదానాల్లో కోహ్లీ స్ట్రైక్ రేట్‌ను పోల్చుతూ పలువురు విశ్లేషిస్తున్నారు. విరాట్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 6 మ్యాచ్‌లు హోమ్‌గ్రౌండ్‌లో ఆడితే.. 4 బయట ఆడాడు. సొంత మైదానంలో 149.70 స్ట్రైక్ రేట్‌తో 253 పరుగులు చేస్తే.. బయటి మైదానాల్లో మాత్రం అతడి ప్రదర్శన సరిగ్గా లేదనే చెప్పాలి. ప్రత్యర్థుల మైదానాల్లో అతడు ఇప్పటి వరకు కేవలం 166 పరుగులే చేశాడు. ఇక స్ట్రైక్ రేట్ 117.73 కూడా మరీ తక్కువగా ఉంది.
సిక్స్‌ల విషయంలోనూ..
విరాట్ కోహ్లీ సిక్స్‌ల విషయంలో కూడా ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో 169 బంతులను ఎదుర్కొన్న విరాట్ మొత్తం 10 సిక్స్‌లు బాదాడు. అయితే.. బయటి స్టేడియాల్లో 141 బంతులు ఆడినప్పటికీ అతడు ఒక్క సిక్స్ మాత్రమే బాదాడు. విరాట్ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 135.16 స్టైక్‌రేట్‌తో మొత్తం 419 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి ఆటతీరుపై పలువురు మాజీలతో పాటు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కోహ్లీ తన టెంపోను కొనసాగించాలని సూచిస్తున్నారు.
ఇకపోతే మరి కాసేపట్లో వాంఖడే మైదానం వేదికగా ముంబయితో తలపడనుంది బెంగళూరు. దీని తర్వాత జరిగే మూడు మ్యాచ్‌ల్లోనూ రెండు బయటి మైదానాల్లోనే జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జట్టు విజయాలుపై కోహ్లీ స్ట్రైక్ రేట్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అక్కడా రాణిస్తే బెంగళూరుకు తిరుగుండదనే చెప్పాలి.
ఇదీ చూడండి : ఈ సారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతలు ఎవరంటే?