Umran Malik: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్, జమ్ము కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో హర్షం వ్యక్తంచేసిన అతడి తండ్రి అబ్దుల్ రషీద్.. భావోద్వేగానికి గురయ్యారు. రోడ్డు పక్కన పండ్లు, కూరగాయాలు అమ్మి.. ఉమ్రాన్‌ను క్రికెట్లో ప్రోత్సాహించిన ఆయన.. ఘనత మాత్రం పూర్తిగా కుమారుడిదేనని చెబుతున్నారు. ఇక తన సంతోషాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదని అన్నారు.
"అందరూ నా దగ్గరికి వచ్చి అభినందనలు చెబుతున్నారు. జాతీయ జెర్సీ ధరించడం కన్నా గొప్ప ఘనత ఏముంటుంది? యావద్దేశం అతడికి మద్దతుగా ఉంది. ఐపీఎల్లో ప్రదర్శన ద్వారా ఉమ్రాన్ మా అందరికీ గర్వకారణంగా నిలిచాడు. ఒక కుటుంబంగా మేము కృతజ్ఞతతో మాత్రమే ఉండగలం. ఉమ్రాన్‌కు విజయం సాధిస్తాననే ఆత్మవిశ్వాసం, తన ప్రతిభపై నమ్మకం ఉండేది. అందుకోసం బాగా శ్రమించాడు. ఈ విజయం కేవలం అతడిదే. అతడి కష్టానికి నాకు గుర్తింపు ఇవ్వకూడదు."
-అబ్దుల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్ తండ్రి
ఐపీఎల్లో హైదరాబాద్ తరఫున ఆడుతున్న 21 ఏళ్ల ఉమ్రాన్.. కళ్లు చెదిరే వేగంతో బంతులను బుల్లెట్లలా సంధిస్తున్నాడు. 150కిమీ వేగంతో బంతులను విసరడమే కాకుండా నిలకడగా ఆ పేస్‌ను కొనసాగించాడు. దీంతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 8.93 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు. దీంతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ క్రమంలోనే అతడిని దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది బీసీసీఐ. దీంతో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ నాయకులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్కడి యువతకు ఉమ్రాన్ స్ఫూర్తిగా నిలిచాడంటూ కొనియాడుతున్నారు.
ఇంగ్లాండ్‌తో టెస్టులకు ఎంపిక చేయాలి: ఉమ్రాన్ మాలిక్‌పై టీమ్‌ఇండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడిని జులైలో ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా టెస్టు జట్టుకు ఎంపిక చేయాలన్నాడు. "‘ఈ సీజన్‌లో ఉమ్రాన్ తన వేగవంతమైన బౌలింగ్‌తో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అతడి వేగం కన్నా నిలకడగా రాణించడమే నన్ను మరింతగా ఆకర్షించింది. అంతవేగంతో బౌలింగ్ చేసే బౌలర్లలో చాలా మంది లెగ్ సైడ్‌వైపు ఎక్కువ బంతుల్ని వేస్తారు. కానీ, ఉమ్రాన్ చాలా తక్కువ బంతులను మాత్రమే అటువైపు వైడ్లుగా నమోదు చేస్తున్నాడు. అలా లెగ్‌సైడ్ వైడ్లను నియంత్రించుకుంటే చాలా గొప్ప బౌలర్‌గా ఎదిగే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు నేరుగా వికెట్ టు వికెట్ సంధించగలడు. అప్పుడు అతడికున్న వేగంతో బ్యాటింగ్ చేయడం ఎవరికైనా అంత తేలిక కాదు. అప్పుడు అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం" అని గావస్కర్ చెప్పుకొచ్చాడు.
ఇవీ చూడండి:
జాతీయ జట్టులోకి ఉమ్రాన్.. పుజారా, హార్దిక్ రిటర్న్.. కెప్టెన్‌గా రాహుల్
స్టెయిన్ గన్.. ఉమ్రాన్ బుల్లెట్.. జమ్ము బౌలర్‌కు భారత్ ఫిదా!