ప్రస్తుతం ఏ క్రికెట్ అభిమానిని కదిలించినా వినిపిస్తున్న పేరు ఐపీఎల్. మరికొద్ది రోజుల్లో టోర్నీ ప్రారంభం కానుంది. దీంతో ఎక్కడ చూసినా ఈ సందడే కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఫ్రాంచైజీలకు సొంత మైదానాల్లో ఆడించేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వకపోవడం వల్ల తటస్థ వేదికలను వారికి కేటాయించారు. దీంతో పలు యజమాన్యాలు తమకు కేటాయించిన మైదానాలకు ఇప్పటికే చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి.
అయితే ఐపీఎల్ అనగానే గుర్తొచ్చేది బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి బౌలర్లపై వారు పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ప్రతి సీజన్లోనూ ఎక్కువ పరుగులు చేసి రికార్డులు నెలకొల్పిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఈ ఏడాది కూడా తమ హిట్టింగ్తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే అవకాశమున్న టాప్-5 బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం.
1) కేఎల్ రాహుల్
పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ కేఎల్ రాహుల్, మరోసారి ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. గత సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన ఇతడు.. ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. జట్టులో కెప్టెన్‌గా ఉంటూనే, ఓపెనర్‌గానూ అదరగొడుతున్నాడు. గతేడాది 129.34 సగటుతో 670 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధశతకాలతో పాటు ఓ సెంచరీ ఉంది.
ఈసారి అదే ఉత్సాహంతో బరిలో దిగి ఈ క్యాప్‌ను తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో సెంచరీతో చేసి ఆకట్టుకున్న కేఎల్ రాహుల్.. ఐపీఎల్లో మరోసారి ఆరెంజ్ క్యాప్‌కు గట్టిపోటీ ఇస్తాడని తెలుస్తోంది.
2) విరాట్ కోహ్లీ
ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ తన బ్యాట్‌తో విజృభించి.. ఓపెనర్‌గానూ బ్యాటింగ్ చేయగలనని నిరూపించాడు. ఇంగ్లీష్ జట్టుపై వన్డే, టీ20 సిరీస్‌లో వరుసగా చేసిన అర్ధశతకాలే ఇందుకు నిదర్శనం! ఈ నేపథ్యంలో రాబోయే ఐపీఎల్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ జట్టులోనూ ఓపెనర్‌గా వస్తానని విరాట్ ఇప్పటికే వెల్లడించాడు.
గతేడాది ఐపీఎల్లో విరాట్ కోహ్లీ.. 42.36 సగటుతో 466 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ ఈసారి ఓపెనర్‌గా రావాలని అనుకున్న నేపథ్యంలో ఆరెంజ్ క్యాప్‌కు ఇతడు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2016 సీజన్లో 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు కోహ్లీ.
3) రిషబ్ పంత్
దిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఆరెంజ్ క్యాప్‌కు ఈసారి గట్టి పోటీదారుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో జరిగిన సిరీస్‌లలో పంత్ బ్యాటింగ్ గణాంకాలే ఇందుకు ఉదాహరణ! ఆ సిరీస్‌లలో మాదిరి బ్యాట్‌తో అదరగొడితే.. ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడే ప్రధాన ఆటగాళ్లలో పంత్ ఉంటాడు అనడంలో సందేహం లేదు. ప్రస్తుత సీజన్లో పంత్ కెప్టెన్సీ అప్పగించడం వల్ల మరింత దూకుడుగా ఆడే ప్రమాదముందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
4) డేవిడ్ వార్నర్
ప్రతి ఐపీఎల్ సీజన్లో కెప్టెన్‌గా తనవంతు పాత్ర పోషిస్తూ.. ఓపెనర్‌గా వచ్చి జట్టు స్కోరుబోర్డును పరుగులు పెట్టించడంలో కీలకపాత్ర పోషిస్తాడు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. గతేడాది ఐపీఎల్లో 134.64 స్ట్రైక్‌రేట్‌తో 548 పరుగులు చేసి, టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో ఈసారి ఆరెంజ్ క్యాప్ పోటీలో వార్నర్ ఉండే అవకాశం ఎక్కువగానే కనిపిస్తోంది.
5) నికోలస్ పూరన్
గాయాల బారిన పడటం, ఫామ్‌ను కోల్పోవడం లాంటి సమస్యలు లేకపోతే.. నికోలస్ పూరన్ ఈసారి ఐపీఎల్లో పూర్తి సీజన్ బ్యాటింగ్ చేసే అవకాశం రావొచ్చు. ఎందుకంటే అతను చివరగా ఆడిన 21 మ్యాచ్‌ల్లో 165.39 స్ట్రైక్‌రేట్ ఉండటమే అందుకు కారణమని చెప్పొచ్చు. దీంతో నికోలస్ పూరన్‌ను పంజాబ్ కింగ్స్ జట్టు టాప్-ఆర్డర్లో ఆడించే అవకాశం రావొచ్చు. పూరన్‌తో పాటు డేవిడ్ మలన్ కూడా టాప్-ఆర్డర్లో ఆడే అవకాశం ఉంది. సీజన్ ప్రారంభం నుంచి బ్యాటింగ్‌లో రాణిస్తే ఈసారి ఆరెంజ్ క్యాప్ కోసం గట్టి పోటీనిచ్చే ఆటగాళ్లలో పూరన్ కూడా ఉండే అవకాశముంది.
వీరితో పాటు జానీ బెయిర్‌స్టో (హైదరాబాద్), ఏబీ డివీలియర్స్ (బెంగళూరు), సూర్యకుమార్ యాదవ్ (ముంబయి), ఇషాన్ కిషన్ (ముంబయి) కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నారు.
ఇదీ చూడండి: కుర్రాళ్లు.. తొలి అవకాశం అందుకుంటారా?