Mumbai Indians' Struggles In IPL 2022: వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడమే ఈ సీజన్లో ముంబయి వైఫల్యానికి ప్రధాన కారణమని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, ప్రస్తుత దిల్లీ సహాయ కోచ్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. అయిదు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతున్న ముంబయి.. ఈ సీజన్లో ఇంకా ఖాతా తెరవని నేపథ్యంలో వాట్సన్ స్పందించాడు. "పాయింట్ల పట్టికలో ముంబయి అట్టడుగున ఉండడం నాకేమీ ఆశ్చర్యం కలిగించట్లేదు. ఎందుకంటే వారి వేలం అంత విస్మయకరంగా సాగింది. ఇషాన్ కిషన్ మీద అంత పెద్ద మొత్తం (రూ.15.25 కోట్లు) పెట్టడం సరి కాదు. అతను నైపుణ్యం ఉన్న ఆటగాడే కానీ.. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేసేంత స్థాయి వాడు కాదు. అసలు ఆడతాడో లేదో తెలియని జోఫ్రా ఆర్చర్‌ను భారీ రేటు (రూ.8 కోట్లు) పెట్టి కొనడం కూడా తప్పిదమే. అతను క్రికెట్ ఆడే చాలా కాలమైంది. ఇలాంటి లోపాలు జట్టులో చాలా ఉన్నాయి" అని వాట్సన్ అన్నాడు.
ఈ సీజన్లో చెన్నై వైఫల్యంపైనా వాట్సన్ మాట్లాడాడు. "వారికి ఫాస్ట్‌బౌలింగ్ సమస్యగా మారింది. ఇంతకుముందు ఆ జట్టులో శార్దూల్ ఠాకూర్ ఉండేవాడు. ఇప్పుడు లేడు. దీపక్ చాహర్ కోసం భారీ ధర పెట్టారు. అతనీ సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. హేజిల్‌వుడ్ లాంటి ప్రపంచ స్థాయి పేసర్‌ను కోల్పోవడం కూడా సమస్యగా మారింది" అని చెప్పాడు.
ఇవీ చూడండి:
ఓటముల్లో ముంబయి 'డబుల్ హ్యాట్రిక్'.. టోర్నీ నుంచి ఔట్!