ఐపీఎల్ చరిత్రలో మొత్తంగా 13 జట్లు ఉన్నాయి. ఇప్పుడున్న 8 ఫ్రాంచైజీలు కాకుండా డెక్కన్ ఛార్జెస్, పుణె వారియర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్‌జైంట్స్ యాజమాన్యాలు టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఈ ఫ్రాంచైజీల ద్వారా టోర్నీలో అనేకమంది ఆటగాళ్లు పరిచయమయ్యారు.
అయితే ఐపీఎల్ చరిత్రలో అనేకమంది ఆటగాళ్లు.. తమ సొంత రాష్ట్రాలకు చెందిన జట్లకు ప్రాతినిధ్యం వహించగా.. కొంతమంది క్రికెటర్లు మాత్రం ఇప్పటికీ వాటికి దూరంగానే ఉన్నారు. తమ స్వరాష్ట్రాలకు చెందిన టీమ్‌లలో ఆడే అవకాశం వారికి రాలేదు. అలా హోమ్ టీమ్‌లో ఆడని క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం...
విరాట్ కోహ్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2008) ప్రారంభ ఎడిషన్ వేలంలో టీమ్ఇండియా అండర్-19 జట్టు ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో ప్రస్తుత టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అయితే కోహ్లీ స్వస్థలం దిల్లీ అయినా.. అప్పటి దిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అతడ్ని తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కోహ్లీకి బదులుగా ప్రదీప్ సంగ్వాన్‌ను ఆ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లీని సొంతం చేసుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు కోహ్లీ ఆర్సీబీతోనే ఉన్నాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ.. ఒకసారి ఆరెంజ్ క్యాప్నూ దక్కించుకున్నాడు.
ఐపీఎల్ కెరీర్లో 192 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 130.73 స్ట్రైక్‌రేట్‌తో 5,878 పరుగులను నమోదు చేశాడు. ఇందులో 39 అర్ధశతకాలు, 5 శతకాలు ఉన్నాయి.
హర్భజన్ సింగ్
పంజాబ్‌కు చెందిన హర్భజన్ సింగ్.. ఐపీఎల్లో ఇప్పటివరకు చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. యాఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు. కానీ, ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు తన సొంతరాష్ట్రానికి చెందిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఒక్క సీజన్లోనూ ఆడే అవకాశం రాలేదు.
హర్భజన్ సింగ్.. ఐపీఎల్లో ఆడిన 160 మ్యాచ్‌ల్లో 150 వికెట్లను పడగొట్టాడు. అదే విధంగా టోర్నీ చరిత్రలో అత్యధిక డాట్‌బాల్స్ వేసిన స్పిన్నర్‌గా భజ్జీ ఘనత సాధించాడు. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.
3) దినేశ్ కార్తిక్
ఐపీఎల్లో ఉన్న 8 ఫ్రాంచైజీల్లో దినేశ్ కార్తిక్.. దాదాపు ఆరు టీమ్‌లలో ఆడాడు. కానీ, తన సొంతరాష్ట్రంలోని చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌కు మాత్రం ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కలేదు.
సీఎస్కేలో వికెట్ కీపర్‌గా ధోనీ ఉండడం వల్ల దినేశ్ కార్తిక్‌కు ఆ జట్టులో ఆడే అవకాశం రాలేదు. కానీ, సీఎస్కే జెర్సీ ధరించడానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నాట్లు అనేక సందర్భాల్లో వెల్లడించాడు దినేశ్ కార్తిక్.
ఐపీఎల్లో అత్యధిక స్టంప్స్ చేసిన వికెట్ కీపర్‌గా ధోనీ తర్వాతి స్థానంలో ఉన్నాడు దినేశ్ కార్తిక్. టోర్నీలో ఆడిన 196 మ్యాచ్‌లలో 129.63 స్ట్రైక్‌రేట్‌తో 3,823 పరుగులను రాబట్టాడు. 2018 నుంచి 2019 వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు దినేశ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గతేడాది జరిగిన ఐపీఎల్‌లోనూ సగానికిపైగా మ్యాచ్‌ల్లో జట్టును ముందుండి నడిపించాడు. ఆ తర్వాత జట్టు పగ్గాలను ఇయాన్ మోర్గాన్‌కు కేకేఆర్ యాజమాన్యం అప్పగించింది.
శ్రేయస్ అయ్యర్
2015లో జరిగిన ఐపీఎల్ సీజన్ నుంచి టోర్నీలో భాగమైన దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఆడిన 79 మ్యాచ్‌ల్లో 126.07 స్ట్రైక్‌రేట్‌తో 2,200 పరుగులు చేశాడు.
దిల్లీ క్యాపిటల్స్ జట్టు చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు రాబట్టిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అతడి పేరు మీద 16 అర్ధశతకాలు ఉన్నాయి. గత మూడు సీజన్లలో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్.. ఆ టీమ్ రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లగా.. గతేడాది జరిగిన ఐపీఎల్లో ఫైనల్ చేరింది.
అయితే ముంబయికి చెందిన ఈ యువ క్రికెటర్‌కు ముంబయి ఇండియన్స్ జట్టులో ఆడే అవకాశం రాలేదు. 2016 సీజన్‌కు ముందు అంతర్గత ట్రేడింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకునేందుకు ముంబయి ఇండియన్స్ జట్టు ప్రయత్నించినా.. అందుకు దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అంగీకరించలేదు.
5) దీపక్ చాహర్
ఐపీఎల్-2016 సీజన్లో రైజింగ్ పుణె సూపర్‌జైంట్స్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన దీపక్ చాహర్‌కు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఆ తర్వాత 2018లో సీఎస్కేలో ఆడిన దీపక్.. బౌలింగ్‌లో రాణిస్తూ టీమ్ఇండియా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో 48 మ్యాచ్‌లు ఆడిన దీపక్ చాహర్.. 22.22 ఎకానమీతో 45 వికెట్లను పడగొట్టాడు. అంతేకాకుండా టోర్నీ చరిత్రలో 5 మెయిడిన్ ఓవర్లు చేశాడు. అయితే రాజస్థాన్‌కు చెందిన ఈ బౌలర్.. 2011,2012 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నా, అతనికి ఆడే అవకాశం రాలేదు.
ఇదీ చూడండి: ఈసారి ఐపీఎల్ 'ఆరెంజ్ క్యాప్' ఎవరిదో?