చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీతో కలిసి ఆడి చాలా కాలమైందని, అతడితో మళ్లీ ఆడాలనే కోరిక బలంగా ఉందని వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతడు ఈసారి ట్రేడింగ్ పద్ధతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చేరాడు. ఈ నేపథ్యంలో ఓ వీడియోలో మాట్లాడుతూ ధోనీతో మళ్లీ ఆడటం తన కల నిజమైందని చెప్పాడు.
"చెన్నై జట్టులో చేరిన సందర్భంగా నాకు అద్భుతమైన స్వాగతం పలికిన అభిమానులందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకూ నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. ఇప్పుడు నా కల నిజమైనట్లుగా అనిపిస్తోంది. ధోనీతో కలిసి ఆడి దాదాపు 12-13 ఏళ్లు అవుతోంది. మహీ రిటైరయ్యేలోపు తనతో కలిసి ఆడి ఈ జట్టుకు టైటిల్ సాధించాలనే కోరిక ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడటం నా అదృష్టం. నేను ఆడుతూ పెరిగిన.. అంబటి రాయుడు, సురేశ్ రైనాతో మళ్లీ ఆడే అవకాశం దక్కింది. ఈసారి చెన్నై తరఫున ఆడి మీ అందర్నీ మరింత ఉత్సాహపరిచేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా."
- ఉతప్ప, చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్
అయితే, ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచీ ఆడుతున్న రాబిన్ ఉతప్ప.. ఇప్పటివరకు 189 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 24 అర్ధశతకాలతో 4,607 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. ఇక గతేడాది రాజస్థాన్ బ్యాట్స్‌మన్‌గా ఆడిన అతడు 12 మ్యాచ్‌ల్లో 16.33 సగటుతో 196 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ ఉతప్పను ట్రేడింగ్ పద్ధతిలో చెన్నైకు వదిలేసుకుంది. దాంతో ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ తన మాజీ సారథితో మళ్లీ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
ఇదీ చూడండి: 'టెస్టు క్రికెటర్‌గా ఏ సమస్యనైనా ఎదుర్కోగలగాలి'