ఐపీఎల్ 2022లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు. టీ20 ఫార్మాట్లో 'ఆండ్రీ రస్సెల్' లాంటి ఆటతీరును పంత్ ప్రదర్శించాలన్నారు రవిశాస్త్రి. క్రీజులోకి వెళ్లినప్పటి నుంచి ఒకే ఊపుతో ఉంటే.. దిల్లీకి మరిన్ని విజయాలను అందించగలిగే సత్తా.. పంత్‌కు ఉందన్నారు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రస్సెల్ ఆట బాగా సరిపోతుందని.. అతనిలాగా స్వేచ్ఛగా షాట్లను ఆడటాన్ని అలవర్చుకోవాలన్నారు. బౌలింగ్ ఎవరు వేస్తున్నారు? ఎలాంటి బంతులను వేస్తున్నారు? అనే విషయాలను పట్టించుకోకుండా.. బంతితో సరిగ్గా కనెక్ట్ అవుతూ.. స్వేచ్ఛగా షాట్లు కొట్టాలని పంత్‌కు సూచించారు శాస్త్రి.
ఈ సీజన్లో ఇప్పటి వరకు దిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్‌లు ఆడగా.. ఐదు మ్యాచ్‌లు గెలిచింది. ఆ మ్యాచ్‌ల్లో పంత్ మొత్తం 281 పరుగులు చేయగా.. 152.71 స్ట్రైక్‌తో ఉన్నాడు. దిల్లీ టీమ్ 10 పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. తర్వాత రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్‌తో మిగిలిన మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.