ఐపీఎల్-14(IPL 2021 News) సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ పోరాటం ముగిసింది. సన్‌రైజర్స్(srh vs mi 2021)తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో విజయం సాధించినా.. నెట్‌రన్‌రేట్ తక్కువగా ఉండటంత వల్ల ప్లే ఆఫ్స్‌కి వెళ్లలేకపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(rohit sharma news) మాట్లాడాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన తమ జట్టు.. ఈ సారి ప్లే ఆఫ్స్‌కు చేరకపోవడం కాస్త నిరాశకు గురిచేసిందన్నాడు. కానీ, ఆరేళ్లలో నాలుగు సార్లు విజేతగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు.
"ఈ మ్యాచ్‌లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులు మాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంపై నిరాశ చెందాం. ముంబయి లాంటి జట్టు ఆడుతున్నప్పుడు మంచి ప్రదర్శన చేస్తుందని అభిమానులు ఆశిస్తారు. నేను దానిని ఒత్తిడిగా భావించను.. అవి అంచనాలు మాత్రమే. ఇషాన్ కిషన్ ప్రతిభ ఉన్న ఆటగాడు. అతడు బ్యాటింగ్ చేయడానికి సరైన స్థానం చాలా కీలకం. ఓపెనింగ్ చేయడం అతడికి నచ్చుతుంది. డగౌట్‌లో కూర్చుని ఇషాన్ ఆడుతుంటే చూడటం అద్భుతంగా ఉంది" అని రోహిత్ శర్మ(rohit sharma news) అన్నాడు.
ముంబయి ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ (84; 32 బంతుల్లో 11×4, 4×6), సూర్యకుమార్ యాదవ్ (82; 40 బంతుల్లో 13×4, 3×6) విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడటం వల్ల ముంబయి 9 వికెట్ల నష్టానికి 235 పరుగుల స్కోరును సాధించింది. సన్‌రైజర్స్ 193 పరుగులకే పరిమితమైంది.