2013 ఐపీఎల్ వేలం తన జీవితాన్ని మార్చేసినంత డబ్బు ఇచ్చిందని, అంత మొత్తం ధర పలకడాన్ని నమ్మలేకపోయానని ప్రముఖ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ అన్నాడు. 2012లో యువ ఆటగాడిగా ఐపీఎల్‌లో దిల్లీ తరఫున అడుగుపెట్టిన అతడు 2014లో పంజాబ్ తరఫున బరిలోకి దిగి అదిరిపోయే ప్రదర్శన చేశాడు. దాంతో ఆ జట్టు.. లీగ్ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరింది. ఇక నాటి నుంచి అతడి దశ తిరిగిపోయింది. అయితే, 2013లో ముంబయి ఇండియన్స్ తనను కొనుగోలు చేసిన ధరను జీవితంలో మర్చిపోలేనని మాక్స్‌వెల్ చెప్పాడు. ఇటీవలే ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన మాక్స్‌వెల్.. నాటి విశేషాలను ఇలా పంచుకున్నాడు.
"2013లో ఐపీఎల్ వేలం జరుగుతున్న రోజు నేను వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడుతున్నా. ఆ వేలం గురించి నాకసలు గుర్తేలేదు. అయితే, ఆ రోజు నేను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటై నిరాశతో వెనుదిరిగా. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నాక అక్కడున్న కొందరు ఎగతాళిగా నవ్వుకుంటున్నారు. ఏం జరుగుతుందో అర్థంకాక కోపంతో అక్కడే కూర్చున్నా. కాసేపటికి మికీ ఆర్థర్, మైఖేల్ క్లార్క్ వచ్చి నన్ను వేరే గదికి తీసుకెళ్లారు. ఆ రోజు నా ప్రదర్శనపై చీవాట్లు పెడతారని అనుకున్నా. కానీ, అప్పుడు ఐపీఎల్ వేలం జరుగుతోందని చెప్పారు. సరే అని పక్కకు తప్పుకున్నా. తర్వాత నేను రూ.5.3 కోట్లు ధర పలికానని చెప్పారు. ఎలా స్పందించాలో అర్థంకాలేదు. మళ్లీ వెళ్లి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్నా. అప్పటికీ వేరేవాళ్లు నవ్వుతూనే ఉన్నారు"
- మాక్స్‌వెల్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్
అదే తన జీవితంలో సంతోషకరమైన రోజు అని, ఆ మ్యాచ్ చూసేందుకు తన కుటుంబం మొత్తం వచ్చిందని మాక్సీ పేర్కొన్నాడు. మ్యాచ్ పూర్తయ్యాక అందరితో కలిసి సంతోషంగా గడిపినట్లు ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ వెల్లడించాడు. ఆ వేలంలో వచ్చిన నగదు తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా, మాక్స్‌వెల్ గతేడాది ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున ఆడాడు. 2019 డిసెంబర్‌లో జరిగిన 2020 వేలంలో ఆ ఫ్రాంఛైజీ అతడిని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అంతమొత్తం చేజిక్కించుకున్నా.. యూఏఈలో జరిగిన మెగా ఈవెంటలో మాక్సీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 13 మ్యాచ్‌లాడి కేవలం 108 పరుగులే చేశాడు. అందులో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గతనెల పంజాబ్ అతడిని వదులుకొంది. ఇప్పుడీ స్టార్ ఆటగాడిని బెంగళూరు కొనుగోలు చేయొచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. అది నిజమో కాదో తెలియాలంటే ఈ సాయంత్రం వరకు వేచి చూడాలి.
ఇదీ చూడండి: కోహ్లీ సారథ్యంలో ఆడాలనుంది: మాక్స్‌వెల్