ఐపీఎల్ 15వ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా తప్పుకున్నాడు. అయితే జడేజా తప్పుకోవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పక్కటెముక గాయం కారణంగా తదుపది మ్యాచ్‌లకు జడేజా అందుబాటులో ఉండడని నిర్వాహకులు చెబుతున్నా.. ఆ ప్రకటనను క్రికెట్ అభిమానులు నమ్మడం లేదు. సూపర్ కింగ్స్ యాజమాన్యం కావాలనే జడేజాను తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్‌స్టాలో జడేజాను సీఎస్‌కే అన్‌ఫాలో చేయడమే ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
గాయం కారణంగానే దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా ఆడలేదు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. జడేజా గాయపడ్డాడు. అయితే ఇందులో నిజం ఉండకపోవచ్చని.. కావాలనే.. జడేజాను సీఎస్‌కే దూరం పెట్టిందనే వాదన సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కెప్టెన్ అయ్యాక ఐపీఎల్ 2022లో జడేజా అంతగా రాణించలేకపోయాడు. కెప్టెన్సీ బాధ్యతలు మీద పడటం వల్ల ఒత్తిడికి గురైన జడ్డూ.. సరిగా ఆడలేదు. ఈ క్రమంలో వ్యక్తిగత ఫామ్‌ను కూడా కోల్పోయాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన జడేజా కేవలం 116 పరుగులు చేసి.. ఐదు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. జడేజా కెప్టెన్సీలో సీఎస్‌కే 8 మ్యాచ్‌లు ఆడగా.. రెండు మాత్రమే గెలిచింది. ఇప్పటికే సీఎస్‌కే స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా.. సీజన్‌కు దూరం కాగా.. రుతురాజ్ గైక్వాడ్, స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. కూడా గాయాలతో కొన్ని మ్యాచులకు దూరమయ్యారు.
ఇదీ చదవండి: IPL 2022: అన్‌క్యాప్డ్ ప్లేయర్స్.. ఈ సారి అద్భుతాలు సృష్టించారుగా!