ఐపీఎల్ నిరవధిక వాయిదా పడటం వల్ల విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశాలకు ప్రత్యేక విమానాల ద్వారా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్‌లు మిగతా సిబ్బంది తమ ప్రభుత్వం విధించిన ప్రయాణ ఆంక్షల కారణంగా ముందుగా ఇక్కడి నుంచి మాల్దీవులకు చేరుకున్నారు. తమ ప్రభుత్వం నిబంధనలను సరళీకరించేవరకు అక్కడే ఉండి ఆ తర్వాత సొంతగూటికి చేరుకుంటారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మాత్రం కరోనా సోకడం వల్ల ఇక్కడే ఉన్నాడు. కోలుకున్నాక చార్టెడ్ ఫ్లైట్ ద్వారా వెళ్తాడు. ఈ విషయాన్ని ఆసీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ప్లేయర్స్ బయలుదేరారు
ఈ లీగ్‌లో పాల్గొన్న 11మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సాధారణ విమానాల తమ దేశానికి బయలుదేరిపోయారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకీబ్ అల్ హాసన్(కోల్‌కతా నైట్‌రైడర్స్), ముస్తాఫిజుర్ రెహ్మాన్(రాజస్థాన్ రాయల్స్).. తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ద్వారా స్వస్థలానికి చేరుకున్నారు. ఆ ఫొటోలను వారు సోషల్‌మీడియాలో పంచుకున్నారు. తాము క్షేమంగానే ఉన్నట్లు వెల్లడించారు.
ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా
ఇంగ్లాండ్ క్రికెటర్లు లండన్ చేరుకున్నారు. టోర్నీలో మొత్తం 12 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉండగా.. గాయంతో టోర్నీకి దూరమైన బెన్ స్టోక్స్ అందరి కంటే ముందు స్వదేశానికి వెళ్లిపోయాడు. టోర్నీ వాయిదా పడ్డాక ఎనిమిది మంది భారత్ నుంచి బయల్దేరి లండన్ చేరుకున్నారు. వీరిలో బట్లర్, మొయిన్ అలీ, సామ్ కరన్, టామ్ కరన్, క్రిస్ వోక్స్, జానీ బెయిర్‌స్టో, జేసన్ రాయ్, సామ్ బిల్లింగ్స్ ఈ బృందంలో ఉన్నారు. ఇయాన్ మోర్గాన్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలన్ ఒకట్రెండు రోజుల్లో స్వదేశానికి బయల్దేరతారు.
11వరకు భారత్‌లోనే
న్యూజిలాండ్ ప్లేయర్స్లోని టెస్టు జట్టు సభ్యులు మే 11న నేరుగా ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. మిగతా వారు శుక్రవారం స్వదేశానికి పయనమవనున్నారు. ఈ విషయాన్ని కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
కివీస్ కెప్టెన్ విలియమ్సన్, కైల్ జెమీసన్, మిచెల్ సాంట్నర్‌తో పాటు ఫిజియో టామీ సిమ్సెక్ కొద్దిరోజుల పాటు దిల్లీలో ఏర్పాటు చేసిన మినీ బయోబబుల్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత వారు ప్రత్యేక విమానంలో నేరుగా ఇంగ్లాండ్‌కు వెళ్తారు. పేసర్ బౌల్ట్, ట్రైనర్ క్రిస్ డొనాల్డ్సన్ మాత్రం ముందుగా వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకుని ఆ తర్వాత టెస్టు జట్టుతో కలవనున్నారు.
మొత్తం 18 మంది న్యూజిలాండ్‌కు చెందిన వారు ఐపీఎల్లో పాల్గొనగా టెస్టు జట్టు సభ్యులు మినహాయిస్తే మిగతా వారు స్వదేశానికి పయనమవుతారు.