సన్‌రైజర్స్ రాత మారలేదు. గత సీజన్ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనను కొనసాగించింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమి మూటగట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మూకుమ్మడిగా విఫలమైంది. మొదట బౌలర్లు చతికిల పడగా.. హైదరాబాద్ జట్టు ముంగిట 204 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది రాజస్థాన్. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఛేదనలోనైనా రాణిస్తారనుకున్న ఫ్యాన్స్ ఆశలను వమ్ము చేస్తూ.. 131 పరుగులకే పరిమితమైంది. ఏ దశలోనూ ఆ జట్టు విజయం సాధిస్తుందనేలా కనిపించలేదు.
మరోవైపు, గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంత పటిష్ఠంగా ఉందనేది తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. గత సీజన్ ఫామ్‌ను కొనసాగిస్తూ తొలుత బ్యాటింగ్‌లో చెలరేగింది. ఆ జట్టు ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (54), జోస్ బట్లర్ (54) ఆరంభం నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎడాపెడా ఫోర్లతో జైశ్వాల్ చెలరేగగా... జోస్ బట్లర్ సిక్సులు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 20 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశాడు బట్లర్. వీరిద్దరి వేగంతో పవర్‌ప్లేలోనే 84 పరుగులు పిండుకుంది రాజస్థాన్. అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్తున్న ఈ జంటకు అఫ్గాన్ జాతీయుడు ఫజల్హక్ ఫారూఖీ బ్రేకులు వేశాడు. సన్‌రైజర్స్‌కు ఆ ఆనందం కొద్దిసేపే అయింది. రాజస్థాన్ జట్టు సారథి సంజూ శాంసన్ క్రీజులోకి అడుగుపెడుతూనే.. విరుచుకుపడ్డాడు. ఈ ముగ్గురు కలిసి సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. శాంసన్ 55 పరుగులు చేసి వెనుదిరగగా.. పడిక్కల్, రియాన్ పరాగ్‌లను వెంటనే ఔట్ చేసి కాస్త ఊపిరి పీల్చుకుంది హైదరాబాద్.
ఛేదనలో హైదరాబాద్‌కు తొలి ఓవర్లోనే రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్ అభిషేక్ శర్మను వెనక్కి పంపిన ట్రెంట్ బౌల్ట్.. వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠీని సైతం అదే ఓవర్లో ఔట్ చేశాడు. హోల్డర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు త్రిపాఠీ వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 27) కాసేపు నిలబడ్డాడు. ఇక రూ.13.5 కోట్లు పెట్టి సన్‌రైజర్స్ కొనుక్కున్న హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ టెస్టును తలపించింది. 21 బంతులు ఎదుర్కొన్న అతడు.. ఒకే ఒక్క ఫోర్ కొట్టి 13 పరుగులు మాత్రమే చేశాడు. వాషింగ్టన్ సుందర్(1), గ్లెన్ ఫిలిప్స్(8) పూర్తిగా నిరాశపర్చారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్.. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మెరుపులు తప్ప పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆదిల్ రషీద్ (18), భువనేశ్వర్ (6) సైతం విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీయగా.. బౌల్ట్ రెండు, హోల్డర్, అశ్విన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.