ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ పై 112 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ మొదటి ఓవర్ నుంచే వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ 59 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు బౌలర్లలో పార్నెల్ 3, బ్రాస్‌వెల్ 2, కర్ణ్ శర్మ 2, సిరాజ్, మ్యాక్స్‌వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో బెంగళూరు 12 పాయింట్లతో ఐదో స్థానానికి చేరింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు.. కెప్టెన్ డుప్లెసిస్ (44 బంతుల్లో 55 పరుగులు: 3x4, 2x6), మాక్స్వెల్ (33 బంతుల్లో 54 పరుగులు: 5x4, 3x6) హాఫ్ సెంచరీలతో మెరిశారు. విరాట్ కోహ్లీ 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. లామ్రోర్(1), దినేశ్ కార్తీక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో అనూజ్ రావత్ 29 పరుగులతో రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో జంపా, ఆసిఫ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు.
బెంబేలెత్తించిన బెంగళూరు బౌలర్లు.. ఈ సీజన్లో మొదటిసారి ఆర్సీబీ బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. మొదటి నుంచే పట్టు తప్పకుండా లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు సంధించారు. వీరి ధాటికి ఓపెనర్లు జైస్వాల్, బట్లర్ ఇద్దరూ డకౌటయ్యారు. మొదటి ఓవర్లో జైస్వాల్‌ను సిరాజ్ ఔట్ చేయగా.. రెండో ఓవర్లో పార్నెల్ బట్లర్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శాంసన్ సహా రూట్, పడిక్కల్, ధృవ్ జోరెల్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ 28-5 తో పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఈ దశలో హిట్మయర్ కరణ్ శర్మ బౌలింగ్‌లో మూడు సిక్లర్లు బాది టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా మరో ఎండ్‌లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. 10.3 ఓవర్లలోనే రాజస్థాన్ ఆలౌటైంది. 59లో హిట్మయర్వే 35 పరుగులు. కాగా రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాటర్లు డకౌట్ అవ్వటం గమనార్హం.
డుప్లెసిస్@4000.. బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న 15 వ ఆటగాడిగా నిలిచాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. కాగా ప్రస్తుత సీజన్లో 631 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి.