IPL 2023 Chris Jordan : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్ ఐదు సార్లు ఛాంపియన్. మిగతా ఏ జట్లు కూడా ఇప్పటివరకు ఐదు టైటిళ్లు నెగ్గలేదు. పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్‌తో తమదైన రోజున బీభత్సం సృష్టించగల ఆటగాళ్లకు ఆ జట్టులో కొదవ లేదు. ఐపీఎల్ ఫైనల్స్‌లో సైతం 130-140 పరుగులను కాపాడుకోగలిగే నాణ్యమైన బౌలర్లు ఆ జట్టు సొంతం. ప్రతి సీజన్లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగే ముంబయికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఏ పరంగా చూసిన ఆ జట్టు టాప్ జట్లలో ఒకటి. కానీ గత రెండేళ్లుగా ఆ జట్టును బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది. 2022 వేలంలో జోఫ్రా ఆర్చర్‌ను రూ.8 కోట్లకు కొనుగోలు చేసినా.. ముంబయి బౌలింగ్‌లో మార్పు రాలేదు.
అయితే ఐపీఎల్ సీజన్ 16ను ముంబయి రెండు వరుస ఓటములతో ప్రారంభించినా.. తరువాత అనూహ్యంగా పుంజుకొని హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. అయితే అడపాదడపా విజయాలు సాధిస్తున్నప్పటికీ ముంబయికి నాణ్యమైన బౌలర్లు లేకపోవటం సమస్యగా మారింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జోఫ్రా ఆర్చర్ తీవ్రంగా నిరాశపరిచాడు. రీసెంట్గా అతడి స్థానంలో వచ్చిన ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ సైతం ఆ జట్టు బౌలింగ్ కష్టాలను తీర్చలేకపోతున్నాడు.
గాయం కారణంగా ఆర్చర్ 2022 సీజన్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత సీజన్‌కు అందుబాటులోకి వచ్చిన ఆర్చర్ పెద్దగా ప్రభావమేమీ చూపలేదు. 5 మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్ కేవలం రెండు వికెట్లే తీయటం గమనార్హం. అయితే ఆర్చర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలగడంతో.. ముంబయి క్రిస్ జోర్డాన్ వైపు మొగ్గు చూపింది. ఆర్చర్‌కు రిప్లేస్మెంట్లో జోర్డాన్‌ను తీసుకొని, మే 9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో బరిలో దింపింది. గత మూడు మ్యాచ్‌ల్లో మొత్తంగా 12 ఓవర్లు బౌలింగ్ చేసిన జోర్డాన్ ఏకంగా 132 పరుగులు సమర్పించుకుని కేవలం ఒక్కటంటే ఒక్కటే వికెట్ పడగొట్టాడు. తాజాగా లఖ్‌నవూతో మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్లు 50 పరుగులు బాదేశారు.
ఇలాంటి పేలవమైన బౌలింగ్‌తో ప్లే ఆఫ్స్‌కు ఎలా వెళ్లేది? అంటూ ముంబయి ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. బుమ్రా లేని లోటు డెత్ ఓవర్లలో స్పష్టంగా కనబడుతుందంటూ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. నాకౌట్ దశకు వెళ్లాలంటే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో జోర్డాన్ స్థానంలో మరో బౌలర్‌ను తీసుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. 'ఇదేం బౌలింగ్ రా బాబు.. ఇంతకు మించి ఎవరు దొరకలేదా?' అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక ముంబయి ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌ల్లో గేలిస్తే.. దాంట్లో ఐదు ఛేదనలో నెగ్గినవే. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా బౌలింగ్‌లో ప్రభావమేమీ చూపలేదు. గుజరాత్‌తో మ్యాచ్‌లో 100 పరుగులకే ఎనిమిది వికెట్లు పడగొట్టినా.. బౌలర్ రషీద్ ఖాన్ ఒక్కడే 10 సిక్సర్లు బాదాడు అంటే ముంబయి బౌలింగ్ విభాగం ఎంత బలహీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ బౌలింగ్‌తో ప్లే ఆఫ్స్ చేరినా టైటిల్ నెగ్గడం మాత్రం అసాధ్యమని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.