IPL 2023 LSG vs MI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో మరో ఆసక్తికర పోరు జరిగింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ జట్లు మంగళవారం తలపడ్డాయి. ప్లేఆఫ్స్ ఆశలు మెరుగుపడాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ అదరగొట్టింది. సొంతగడ్డపై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ముంబయిని ఓడించింది.13 మ్యాచ్‌ల్లో లఖ్‌నవూకు ఇది ఏడో విజయం కాగా.. అన్ని మ్యాచ్‌లాడిన ముంబయి ఆరో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయిని.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. ముంబయి జట్టు విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. లఖ్‌నవూ బౌలర్ మోసిన్ ఖాన్ అద్భుతంగా బంతులు విసిరి.. 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇషాన్ కిషన్ (59; 39 బంతుల్లో 8×4, 1×6), టిమ్ డేవిడ్ (32 నాటౌట్; 19 బంతుల్లో 1×4, 3×6) గెలిపించడానికి గట్టి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రవి బిష్ణోయ్ (2/26), మోసిన్ ఖాన్ (1/26), యశ్ ఠాకూర్ (2/40) ఆ జట్టును దెబ్బ తీశారు.
ఛేదిస్తుందని అనుకున్నా... నిజానికి ముంబయి ఛేదన ప్రారంభమైన తీరు చూస్తే.. ఆ జట్టు లక్ష్యాన్ని ఈజీగానే ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే మొదట్లో లఖ్‌నవూ పేలవ బౌలింగ్ చేయడం, ఫీల్డింగ్ తప్పిదాలు.. ముంబయికి కలిసొచ్చింది. పిచ్ అంత తేలిగ్గా లేకపోయినప్పటికీ.. ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే విధ్వంసకర బ్యాటింగ్ బ్యాటింగ్ చేస్తూ ముంబయికి మంచి శుభారంభానిచ్చాడు. లఖ్‌నవూ బౌలర్ల లయను దెబ్బ తీశాడు. రోహిత్ కూడా సమయోచితంగా షాట్లు ఆడాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అలా పవర్ ప్లే ముగిసేసరికి ముంబయి 58/0తో బలంగానే ఉంది. ఆ తర్వాత కూడా కాసేపు ఓపెనర్లు నిలకడగా ఆడారు. అయితే స్పిన్నర్ రవి బిష్ణోయ్ రాకతో ముంబయి కథ మారింది. కట్టుదిట్టంగా బంతులేశాడు. దీంతో రోహిత్, ఇషాన్ స్వల్ప వ్యవధిలో క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత సూర్యకుమార్ (7), వధేరా (16) రాణించలేకపోయారు. అనంతరం డేవిడ్ ప్రతికూల పరిస్థితుల్లో భారీ షాట్లు ఆడుతూ జట్టు ఆశలను నిలిపాడు. కానీ ఫలితం దక్కలేకపోయింది.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. స్టాయినిస్ (89*; 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) అర్ధ శతకంతో విరుచుకుపడ్డాడు. కృనాల్ పాండ్య (49; 42 బంతుల్లో ) అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వెనుదిరిగాడు. ఓపెనర్ డికాక్ (16) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ దీపక్ హుడా (5) పేలవ ప్రదర్శన చేశాడు. పూరన్ (8*) పరుగులు చేశాడు. ఇక, ముంబయి బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్ రెండు వికెట్లు తీయగా.. చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు.