ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి నిరాశపరిచింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్దేశించిన లక్ష్యాన్ని లఖ్‌నవూ 16 ఓవర్లలోనే ఛేదించేసింది. కెప్టెన్ రాహుల్(35), కృనాల్ పాండ్య(34) మెరుగ్గా రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో అదిల్ రషిద్ రెండు వికెట్లు తీశారు. ఉమ్రాన్, భువనేశ్వర్, ఇంపాక్ట్ ప్లేయర్ ఫరూఖి తలో వికెట్ పడగొట్టారు.
హైదరాబాద్ నిర్దేశించిన స్వల్ప లక్ష్య ఛేదనను లఖ్‌నవూ ప్రారంభించింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయేర్స్ బరిలోకి దిగారు. బ్యాటర్ రాహుల్ త్రిపాఠి బదులు ఫరూఖిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా హైదరాబాద్ తీసుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న కేల్ మేయర్స్ (13) ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ఫరూఖి బౌలింగ్‌లో (4.3వ ఓవర్) బౌండరీ లైన్ వద్ద మయాంక్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మేయర్స్ పెవిలియన్‌కు చేరాడు. తన బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన దీపక్ హుడాను (7) భువనేశ్వర్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకోవడం విశేషం. మూడోవికెట్‌కు కృనాల్ పాండ్య, కేఎల్ రాహుల్ అర్ధశతక భాగస్వామ్యం నిర్మించారు. ఉమ్రాన్ మాలిక్ వేసిన అద్భుతమైన బంతికి కృనాల్ (34) కీపర్ చేతికి చిక్కాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (35) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. అదిల్ రషీద్ వరుసగా రెండో వికెట్ తీశాడు. రొమారియో షెఫెర్డ్ (0)ను ఎల్బీ చేశాడు. స్టోయినిస్(10*), నికోలస్ పూరన్(11*) జట్టును విజయతీరాలకు చేర్చారు.
టాస్‌నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా అన్‌మోల్, మయాంక్ అగర్వాల్ క్రీజ్‌లోకి వచ్చారు. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ (8) కవర్స్‌లో స్టొయినిస్ చేతికి చిక్కి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 21 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అన్‌మోల్ సింగ్ (31) ఔటయ్యాడు. కృనాల్ పాండ్య బౌలింగ్‌లోనే ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా సమీక్షలో అంపైర్స్ కాల్ రావడంతో డగౌట్‌కు చేరకతప్పలేదు.
సన్‌రైజర్స్ సారథి ఐదెన్ మార్‌క్రమ్ (0) లీగ్ తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. తొలి బంతికే క్లీన్‌బౌల్డ్‌గా ఔటయ్యాడు. కృనాల్ పాండ్య వేసిన ఎనిమిదో ఓవర్ చివరి బంతికి బౌల్డ్ అవడంతో పెవిలియన్‌కు చేరాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (3) కూడా పెవిలియన్‌కు చేరాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన బ్రూక్ స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (35) పెవిలియన్‌కు చేరాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు యత్నించి అమిత్ మిశ్రా అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు.
వాషింగ్టన్ సుందర్ (16) భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. లాంగాఫ్‌లో దీపక్ హుడా అద్భుతంగా ఒడిసిపట్టాడు. అమిత్ మిశ్రా రెండో వికెట్‌ను తీశాడు. సుందర్ స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన అదిల్ రషీద్ ఫోర్ కొట్టాడు. అయితే చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించి దీపక్ హుడా చేతికి చిక్కాడు.హైదరాబాద్ స్వల్ప వ్యవధిలో మరో వికెట్‌ను కోల్పోయింది. అయితే ఈసారి రనౌట్ రూపంలో కావడం గమనార్హం. జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో ఉమ్రాన్ (0) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. చివరల్లో అబ్దుల్ షమద్ రెండు సిక్సులు బాదాడు. కేవలం పది బంతుల్లో 21 పరుగులు సాధించాడు. షమద్, భువనేశ్వర్ నాటౌట్‌గా నిలిచారు. దీంతో సన్‌రైజర్స్ స్కోరు 121 పరుగులు చేసింది.