ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో భాగంగా తాజగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ పోరులో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సామ్ కరన్(55; 29 బంతుల్లో 5×4, 4×6) , హర్‌ప్రీత్ సింగ్, జితేశ్ శర్మ(25; 7 బంతుల్లో 4×6)లు తమ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోశారు. వారి బ్యాటింగ్ విధ్వంసానికి పలు రికార్డులు బద్దలయ్యాయి. మరి ఆ రికార్డులేంటో తెలుసుకుందాం..
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేశ్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఏడు బంతుల్లోనే 25 పరుగులు చేసి.. పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్‌రేట్ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 357.14 స్ట్రైక్‌రేట్‌తో అగ్ర స్థానంలో ఉన్నాడు. బానుక రాజపక్స 344.44 స్ట్రైక్‌రేట్‌తో 9 బంతుల్లో 31 రన్స్, కేఎల్ రాహుల్ 318.75 స్ట్రైక్‌రేట్‌తో 16 బంతుల్లో 51 రన్స్, నికోలస్ పూరన్ 312.50 స్ట్రైక్‌రేట్‌తో 8 బంతుల్లో 25*పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్ లాస్ట్ సిక్స్ ఓవర్స్‌లో 109 రన్స్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలో చివరి ఆరు ఓవర్లలో పంజాబ్ ఇన్ని పరుగులు చేయడం ఇదే తొలిసారి. మొత్తంగా పంజాబ్.. రెండో స్థానంలో ఉండగా.. ఫస్ట్ ప్లేస్‌లో స్థానంలో ఆర్సీబీ ఉంది. ఆ జట్టు గుజరాత్ లయన్స్‌పై చివరి ఆరు ఓవర్లలో 126 పరుగులు చేసింది. ఇకపోతే 2020లో పంజాబ్ కింగ్స్‌పై ముంబయి.. 104 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ ప్లేయర్స్ సామ్ కరన్-హర్‌ప్రీత్ బాటియాలు ఐదో వికెట్‌కు 92 పరుగులు నమోదు చేశారు. పంజాబ్ కింగ్స్ జట్టులో ఐదో వికెట్‌కు.. ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అగ్ర స్థానంలో డేవిడ్ మిల్లర్-రాజ్‌గోపాల్ సతీష్ జోడీ 130*పరుగులు జోడించారు.
పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జున్ తెందుల్కర్ తన మూడో ఓవర్లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ముంబయి ఇండియన్స్ తరపున ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా అర్జున్ తెందుల్కర్ నిలిచాడు. ఒక ఓవర్లో 35 పరుగులు ఇచ్చి ఫస్ట్ ప్లేస్‌లో డేనియల్ సామ్స్ ఉన్నాడు. కేకేఆర్‌పై ఈ ప్రదర్శన చేశాడు.
ఇదీ చూడండి: IPL 2023 MI VS PBKS : అర్ష్‌దీప్ దెబ్బకు ముంబయికి నిరాశ.. పంజాబ్ విజయం