ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది దిల్లీ క్యాపిటల్స్. ఫలితంగా దిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమిని అందుకుంది. కాగా, 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ ఆఖరి బంతికి గెలుపొంది ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.
అయితే ఈ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఓ సూపర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో 600 ఫోర్లు బాదిన ఫస్ట్ ఫారెన్ క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 6 ఫోర్లు బాదిన డేవిడ్ భాయ్.. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. మొత్తంగా(దేశీ, విదేశీ) ఈ ఫీట్ అందుకున్న క్రికెటర్ల జాబితాలో టీమ్ఇండియా సీనియర్ ఓపెనింగ్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 728 ఫోర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ ఓటమిపై వార్నర్ మాట్లాడుతూ.. "ఈ సీజన్‌లో గత మూడు మ్యాచ్‌లు కూడా ఉత్కంఠగా జరిగాయి. చివరి ఓవర్‌లోనే మ్యాచ్ ఫలితం తేలింది. ఈ మ్యాచ్‌లో మేము చివరివరకు పోరాడం. మేము ఓడిపోయినప్పటికీ... మా టీమ్ ప్లేయర్స్ అద్భుతంగా రాణించారు. ఇక ముంబయి టాపర్డర్‌లో అయితే రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ బాగా ఆడాడు. మా టీమ్‌లో నోర్జే, ముస్తాఫిజర్ రెహ్మన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. వారు తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేశారు. కానీ బ్యాడ్ లక్ మ్యాచ్‌లో ఓడిపోవాల్సి వచ్చింది. అలాగే లాస్ట్ బాల్‌కు నేను తప్పుడు వైపు త్రో వేశాను. వికెట్ల హైట్ దృష్టిలో పెట్టుకుని పైకి విసిరాను. అది ముంబకు కలిసొచ్చింది. ఏదేమైనప్పటికీ వరుసగా వికెట్లను కోల్పోవడం మా విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఇక అక్షర్ విషయానికి వస్తే.. అతడు క్లాసిక్ ఆల్‌రౌండర్. అతడు స్ట్రైకింగ్ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్లేయర్ టాప్-4లో బ్యాటింగ్‌కు దిగితే చాలా బాగుంటుంది. మా నెక్ట్స్ మ్యాచ్‌లో గెలవాలని భావిస్తున్నాం" అని వార్నర్ పేర్కొన్నాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో ఫస్ట్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్.. 19.4 ఓవర్లలో 172 పరుగులకు చేసి ఆలౌట్ అయింది. దిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్(51), అక్షర్ పటేల్(25 బంతుల్లో 54 పరుగులు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ముఖ్యంగా అక్షర్ చెలరేగి ఆడాడు. సిక్సర్లు బాదుతూ దూకుడుగా ఆడాడు. ముంబయి బౌలర్లలో బెరెన్‌డార్ఫ్, చావ్లా మూడు వికెట్లు తీయగా.. మెరిడిత్ రెండు వికెట్లు తీశాడు.
ఇదీ చూడండి: Suryakumar: గోల్డెన్ డక్ కింగ్ భయ్యా నువ్వు.. ఇక టీ20ల్లో మొదలు పెట్టావా?