IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌ను పేలవమైన ప్రదర్శనతో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆడిన రెండో మ్యాచ్‌లోనే అదరగొట్టిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో సోమవారం తలపడనుంది. చెన్నై నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఊపు మీదున్న లఖ్‌నవూను హైదరాబాద్ అడ్డుకోగలదా? ఇరు జట్ల బలాబలాలేమిటి?
బోణీ కోసం సన్‌రైజర్స్: ఐపీఎల్ 2022లో బోణీ కొట్టాలని చూస్తోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. తొలి మ్యాచ్‌లో ఘోర పరాభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో లఖ్‌నవూపై విజయం సాధించాలని భావిస్తోంది. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 61 పరుగుల తేడాదో ఓటమి చెందింది. భువనేశ్వర్ కుమార్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేసినా.. మిగతా బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్ భారీగా పరుగులు సమర్చించుకోవటం ఆందోళన కలిగించే విషయమే. రానున్న మ్యాచుల్లో తమ బౌలింగ్ మెరుగుపడుతుందని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ ఆశాభావంతో ఉంది. మరోవైపు.. బ్యాటింగ్‌లోనూ పేలవ ప్రదర్శన జట్టును కలవరపెడుతోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మతో పటిష్ఠంగానే కనిపిస్తున్నా ప్రదర్శనలో అంతంత మాత్రంగానే ఉంది. ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టాలంటే ఆల్‌రౌండ్ ప్రదర్శన అవసరమని పలువురు క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
జోరు మీద లఖ్‌నవూ: అరంగేట్ర సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన లఖ్‌నవూ రెండో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ట్రాక్‌లోకి వచ్చింది. తనకు ఉన్న బ్యాటింగ్ బలంతో సోమవారం హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసేందుకు తహతహలాడుతోంది. తొలిమ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది లఖ్‌నవూ. కానీ, రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైకి షాకిస్తూ భారీ స్కోర్‌ను సైతం ఊదేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, ఓపెనర్ క్వింటాన్ డికాక్ మంచి ఫామ్‌లో ఉన్నారు. సీఎస్కేపై తొలివికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వెస్టిండీస్ బ్యాటర్ ఎవిన్ లేవిస్ 23 బంతుల్లోనే 55 పరుగులు చేసి భారీ స్కోర్‌ను ఛేదించటంలో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్లో దీపక్ హూడా జట్టుకు బలమయ్యాడు. యువ ఆటగాడు ఆయుష్ బదోని సైతం రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
బోలింగ్ విభాగంలో ఆవేశ్ ఖాన్, శ్రీలంక ఆటగాడు దుష్మంత చమీరా, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్ జరిగిన రెండు మ్యాచుల్లో వికెట్లు పడగొట్టారు. అయితే.. వారు ఎక్కువగా పరుగులు ఇవ్వటం లఖ్‌నవూ జట్టును కలవరపెడుతోంది. పరుగులను కట్టడి చేస్తూ వికెట్లు పడగొడితే వారికి ఎదురే ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మనన్ వోహ్రా, ఎవిన్ లేవిస్, మనీశ్ పాండే, క్వింటాన్ డికాక్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీరా, షాబాజ్ నదీమ్, మోసిన్ ఖాన్, మాయంగ్ యాదవ్, అంకిత్ రాజ్‌పుత్, అవేశ్ ఖాన్, ఆండ్రూ టై, మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్, కరన్ శర్మ, క్రిష్ణప్ప గౌతమ్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, జసన్ హోల్డర్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐదెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ప్రియమ్ గార్గ్, విష్ణు వినోద్, గ్లేన్ ఫిలిప్స్, ఆర్ సమర్థ్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుదర్, రొమారియో షెపార్డ్, మార్కో జన్సెన్, జే సుచిత్, శ్రేయస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, సీన్ అబ్బాట్, కార్తిక్ త్యాగి, సౌరబ్ తివారి, ఫాజల్హాక్ ఫరూకి, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్.
ఇదీ చూడండి: 'హైదరాబాద్ అభిమానులు ఫుల్ కుష్'.. చెన్నైపై నెటిజన్ల సెటైర్లు!