IPL 2022 CSK VS PBKS: ఐపీఎల్-2022లో వరుసగా మూడు మ్యాచ్‌లు కోల్పోయి పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతున్న చెన్నై టీమ్ మళ్లీ గాడిలో పడాలంటే కొత్త దారి కనుక్కోవాలని ఆ జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజా అన్నాడు. ఆదివారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన జడ్డూ తమ జట్టు ఓటమికి గల కారణాలపై స్పందించాడు.
" మేం పవర్ ప్లేలో చాలా వికెట్లు కోల్పోయాం. తొలి బంతి నుంచే వెనుకబడిపోయాం. మేం బలంగా పుంజుకొని రావడానికి కొత్త దారి కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి భరోసా ఇవ్వాలి. అతడికి అండగా ఉండాలి. అతడెంత మంచి ఆటగాడో మా అందరికీ తెలుసు. కచ్చితంగా అతడి విషయంలో అండగా ఉంటాం. రాబోయే మ్యాచ్‌ల్లో అతడు రాణిస్తాడనే నమ్మకం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబె అద్భుతంగా ఆడుతున్నాడు. అతడిని ఇలాగే సానుకూల దృక్పథంతో ఉంచగలిగితే మా జట్టుకు కలిసివస్తుంది. ఇకపై శక్తి మేరకు ప్రయత్నించి తిరిగి బలం పుంజుకుంటాం"
- రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.
లివింగ్‌స్టోన్ ఆడితే ఊపిరి బిగబట్టి చూస్తారు: చెన్నైతో మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ.. 180 పరుగులు ఛేదించడం అంత తేలిక కాదన్నాడు. 'ముఖ్యంగా కొత్త బంతితో వికెట్లు తీస్తే పని తేలికవుతుంది. ఈ మ్యాచ్‌లో అదే చేశాం. ఆదిలోనే వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్‌పై పట్టు సాధించి గెలుపొందాం. ఇక లివింగ్‌స్టోన్ ఎలా ఆడాలనేది నేనేం చెప్పలేదు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి చూస్తారు. లివింగ్‌స్టోన్ ఆడే కొన్ని షాట్లు చూడముచ్చటగా ఉంటాయి. వైభవ్ అరోరా కూడా మంచి నైపుణ్యం కలిగిన ఆటగాడు. ఇకపైనా సానుకూల దృక్పథంతో ఇలాగే ఆడి విజయాలు సాధించాలనుకుంటున్నాం' అని పేర్కొన్నాడు.
పంజాబ్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి ఓటమిపాలై.. రెండు విజయాలు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చూడండి: IPL 2022: మూడో మ్యాచ్‌లోనూ చెన్నై దారుణ ఓటమి.. దూబే పోరాడినా..