IPL 2022 MI VS RR: ఐపీఎల్ 15వ సీజన్లో ఎట్టకేలకు ముంబయి తొలి విజయం నమోదు చేసింది. తొమ్మిదో మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల ఖాతాను ఓపెన్ చేసింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 158/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి ఐదు వికెట్లను కోల్పోయి 19.2 ఓవర్లలో 159 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (51) అర్ధ శతకంతో రాణించగా.. తిలక్ వర్మ (35), ఇషాన్ కిషన్ (26), టిమ్ డేవిడ్ (20*) ఫర్వాలేదనిపించారు. రోహిత్ శర్మ 2, పొలార్డ్ 10, డానియల్ సామ్స్ 6* పరుగులు చేశారు. ఇవాళ ముంబయి సారథి రోహిత్ శర్మ పుట్టిన రోజు. ఈ విజయాన్ని బర్త్‌డే బాయ్‌కు ముంబయి ఆటగాళ్లు గిఫ్ట్‌గా ఇచ్చారు.
ముంబయి జట్టు టాస్ గెలిచి రాజస్థాన్‌ను బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ జోస్ బట్లర్ (67) అర్ధశతకం సాధించడం వల్ల ముంబయికి రాజస్థాన్ 159 పరుగుల మోస్తరు లక్ష్యం నిర్దేశించింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. బట్లర్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (21) వేగంగా పరుగులు రాబట్టాడు. దేవదుత్ పడిక్కల్ (15), సంజూ శాంసన్ (16), డారిల్ మిచెల్ (17), రియాన్ పరాగ్ (3), హెట్‌మయేర్ (7*) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో హృతిక్ షోకీన్ 2, రిలే మెరెడిత్ 2.. డానియల్ సామ్స్, కుమార్ కార్తికేయ చెరో వికెట్ తీశారు.
ఇదీ చదవండి: గుజరాత్‌ను గెలిపించిన తెవాతియా, మిల్లర్.. ఓటముల్లో ఆర్సీబీ హ్యాట్రిక్