రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరిన తర్వాత తన ఆటతీరులో మార్పు వచ్చిందని అంటున్నాడు ఆ జట్టు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell News). ఐపీఎల్‌లోని(IPL 2021) ఇతర ఫ్రాంఛైజీలతో పోలిస్తే ఆర్సీబీ శిబిరం చాలా భిన్నంగా ఉందని తెలిపాడు. యువ ఆటగాళ్ల ప్రోత్సహించే విధమైన వాతావరణం ఆర్సీబీలో ఉందని అభిప్రాయపడ్డాడు. జట్టులోని యువ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్‌పై(Srikar Bharat RCB) ప్రశంసలు కురిపించాడు.
"ఈ మ్యాచ్‌లో మేము చాలా బాగా ఆడాము. బౌలింగ్‌లోని చివరి పది ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేయగలిగాం. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ను ముగించాం. అదే విధంగా ఆర్సీబీ జట్టులో చేరిన తర్వాత నా ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఇతర ఫ్రాంఛైజీలతో పోలిస్తే ఇక్కడ కొంచెం భిన్నంగా ఉంది. జట్టులోని యువ ఆటగాళ్లందరూ ఒకరిపై ఆధారపడకుండా సొంతంగా రాణించడం సంతోషకరమైన విషయం. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మన్(కేఎస్ భరత్) అద్భుతంగా రాణించాడు. అతడొక టాప్ క్లాస్ బ్యాటర్".
- గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆర్సీబీ ఆల్‌రౌండర్
ఐపీఎల్లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండ్ జోరుతో(RCB Vs RR) అదరగొట్టింది. మ్యాక్స్‌వెల్ (50 నాటౌట్), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (44) మెరవడం వల్ల 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల మొదట రాజస్థాన్ 9 వికెట్లకు 149 పరుగులే చేయగలిగింది. లూయిస్ (58) ధనాధన్ ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓ దశలో మంచి స్కోరు చేసేలా కనిపించిన రాజస్థాన్‌కు చాహల్ (2/18), షాబాజ్ అహ్మద్ (2/10), హర్షల్ పటేల్ (3/34) కళ్లెం వేశారు. భరత్, మ్యాక్స్‌వెల్‌ల జోరుతో లక్ష్యాన్ని బెంగళూరు 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో(RCB Next Match) పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
ఇదీ చూడండి.. RCB Vs RR: కోహ్లీసేనకు ప్లేఆఫ్ ఆశలు పదిలం!