కరోనా విజృంభణ దృష్ట్యా భారత్ నుంచి విమాన రాకపోకలను మే15 వరకు నిలిపివేస్తున్నట్లు ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగానే పలువురు ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి తప్పుకోగా, మరికొందరు సీజన్‌ను మధ్యలోనే వీడేందుకు సిద్ధమవుతున్నారు. తమను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని కొంతమంది ఆటగాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే తమ క్రికెటర్లను వెనక్కు తీసుకొచ్చే తక్షణ చర్యలు ఏమీ తీసుకోవట్లేదని ఆసీస్ బోర్డు తాత్కాలిక సీఈఓ నిక్ హాక్లే చెప్పారు.
"ఆటగాళ్ల కోసం ఇప్పుడు ప్రత్యేక విమానాలు ఏం ఏర్పాటు చేయట్లేదు. ఆస్ట్రేలియా బోర్డు.. బీసీసీఐ, ఆటగాళ్లతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. లీగ్ పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వారు చెప్పారు. బీసీసీఐ వారిని సురక్షితమైన బయో బబుల్‌లో ఉంచింది. ప్లేయర్స్ తమ ఇంటికి చేరేవరకు సురక్షితంగా చూసుకుంటామని బోర్డు హామీ ఇచ్చింది" అని నిక్ వెల్లడించారు.
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆండ్రూ టై, ఆడమ్ జంపా, రిచర్డ్‌సన్, లియామ్ లివింగ్‌స్టోన్ సహా పలువురు కంగారూ ఆటగాళ్లు ఐపీఎల్ ప్రస్తుత సీజన్ నుంచి తప్పుకున్నారు.
ఇదీ చూడండి: ఐపీఎల్ బయోబబుల్ సురక్షితం: జంపా