చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తడబడింది. ఓపెనర్ సాహా (44) రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్ సమష్టిగా విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకు పరిమితమైంది సన్‌రైజర్స్.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ (2) ఏమాత్రం ఆకట్టుకోకపోగా.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడనుకున్న విలియమ్సన్ (11) త్వరగానే పెవిలియన్ చేరాడు. కాసేపటికే ప్రియమ్ గార్గ్ (6) కూడా ఔటయ్యాడు. ఇలా ఓ వైపు వికెట్లు పడుతున్నా సాహా మాత్రం ఇన్నింగ్స్‌ను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇక సాహా హాఫ్ సెంచరీ ఖాయమనుకున్న దశలో ఇతడిని బోల్తా కొట్టించాడు జడేజా.
అనంతరం యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ (18), అబ్దుల్ సమద్(18) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ వీరిద్దరిని ఔట్ చేసి సీఎస్కే శిబరంలో ఆనందాన్ని నింపాడు హెజిల్వుడ్. తర్వాత వచ్చిన హోల్డర్ (5) కూడా నిరాశపర్చాడు. చివర్లో రషీద్ ఖాన్ (17*) కాసేపు పోరాడటం వల్ల సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.