అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్పై టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆటకు వీడ్కోలు పలికే వరకు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరఫున ఆడాలనేది తన కోరిక అని అంటున్నాడు. 2014లో ఆర్సీబీ జట్టులో చేరిన తర్వాత తనకు గుర్తింపుతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. ఐపీఎల్లో వచ్చే ఏడాది జరగనున్న మెగా ఐపీఎల్ నేపథ్యంలో చాహల్ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"నేను క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో.. నేను ఐపీఎల్ జట్టు ఆర్సీబీలో ఉండాలని కోరుకుంటున్నా. ఈ జట్టులో చేరిన తర్వాతే నా జీవితం పూర్తిగా మారిపోయింది. 2014లో ఆర్సీబీ జట్టులో భాగమైన తర్వాత నేను అంటూ ఒకడిని ఉన్నానని ప్రేక్షకులకు తెలియదు. ఎందుకంటే అమిత్ మిశ్రా, జయంత్ యాదవ్ లాగా నేను రంజీ ట్రోఫీల్లో ఆడకపోవడమే కారణం. కానీ, ఆ సంవత్సరంతో నా జీవితం మారిపోయింది. అందువల్ల నేను ఆర్సీబీలో ఉన్నప్పుడే రిటైర్ అవ్వాలనేది నా కోరిక. నేను ఐపీఎల్ ఆడుతున్నానంటే అది ఆర్సీబీ జట్టు వల్లే!".
- యుజ్వేంద్ర చాహల్, టీమ్ఇండియా స్పిన్నర్
అయితే 2013లో జరిగిన వేలంలో ముంబయి ఇండియన్స్ జట్టు తొలిసారి చాహల్‌ను సొంతం చేసుకుంది. అదే ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 2014లో ఆర్సీబీ చేరిన తర్వాత తొలిసారి టోర్నీ మొత్తం మ్యాచ్‌ల్లో భాగమయ్యాడు. అప్పటినుంచి ఆర్సీబీ ఆడిన ప్రతి మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించి.. 23 సగటుతో 126 వికెట్లను పడగొట్టాడు.
ఇదీ చూడండి.. IND Vs ENG: 'ఆఖరి టెస్టు రద్దు.. వారికి క్షమాపణలు చెబుతున్నా'