ఐపీఎల్ 2021 రెండో దశ యూఏఈలో ప్రారంభమైంది. ఆదివారం ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరుతో లీగ్ మొదలైంది. చాలారోజుల తర్వాత అభిమాన ఆటగాళ్లు బరిలో దిగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్.. మ్యాచ్‌లు చూడటంలో నిమగ్నమయ్యారు. కానీ తాలిబన్ల చేతిలో ఉన్న అఫ్గానిస్థాన్ మాత్రం ఈ వినోదానికి నోచుకోలేదట. దానికి కారణం ఆ దేశంలో ఐపీఎల్ ప్రసారాల్ని నిషేధించడమే అని తెలుస్తోంది.
ప్రస్తుతం తాలిబన్ల చేతిలో చిక్కుకుంది అఫ్గాన్. వారి పాలనలో మతభావాలకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ గల వినోద కార్యక్రమాల ప్రసారాలను ఆ దేశంలో నిషేధించారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారమూ నిలిపేశారు. దీనికి కారణం ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారమయ్యే సమయంలో మైదానంలో చీర్ లీడర్స్ డ్యాన్స్‌లు చేయడం వంటి మతభావ వ్యతిరేక కంటెంట్ ఉండటమేనని తెలుస్తోంది.
"ఐపీఎల్ మ్యాచ్‌లను అఫ్గానిస్థాన్‌లో ప్రసారం చేయడం లేదు. ఇందులో కంటెంట్, మహిళల డ్యాన్స్‌లు.. తదితర కారణాల దృష్ట్యా ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ తాలిబన్ ఈ టోర్నీ ప్రసారాలపై నిషేధం విధించింది’" అని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ మీడియా మేనేజర్, జర్నలిస్టు ఇబ్రహీం మహ్మద్ ట్విట్టర్లో వెల్లడించారు.
అమ్మాయిలు క్రీడల్లో పాల్గొనకూడదనేది తాలిబన్ల నిబంధన. అందుకోసమే అఫ్గాన్ మహిళలు క్రీడల్లో పాల్గొనడంపై ఎప్పుడో నిషేధం విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా వారు మాత్రం నిబంధనలకు కట్టుబడతామని వెల్లడించారు. దీంతో ఆస్ట్రేలియా పురుషుల జట్టు అఫ్గాన్‌తో ఆడాల్సిన టెస్టు మ్యాచ్‌ను రద్దు చేసుకుంది. మహిళల్ని ఆడనిస్తేనే తాము ఈ సిరీస్ ఆడతామని స్పష్టం చేసింది. దీనిపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు, ఆసీసీ బోర్డుకు మధ్య ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.
అఫ్గానిస్థాన్ స్టార్ ఆటగాళ్లు రషీద్‌ఖాన్, నబీతో పాటు పలువురు అఫ్గాన్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. తాలిబన్ల తాజా నిర్ణయం పట్ల వీరు విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.