ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఫ్రాంచైజీలు వారి వారి ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా బ్యాట్స్‌మెన్ వారి పరుగుల దాహం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ లీగ్‌లో కొందరు బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి జట్లపై విరుచుపడి భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈసారి కూడా ఇలాంటి ఇన్నింగ్స్నే ఆశిస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.
![batsmen with highest individual scores in IPL history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338884_1.jpg)
క్రిస్ గేల్ (175)
![batsmen with highest individual scores in IPL history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338884_2.jpg)
ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ముందున్నాడు. 2013 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన ఇతడు పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లోనే 175 పరుగులు సాధించి సునామీ సృష్టించాడు. ఇందులో 13 ఫోర్లు 17 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసిన ఇతడు ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తర్వాత పుణెను 133 పరుగులకే పరిమితం చేసిన కోహ్లీసేన 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బ్రెండన్ మెక్‌కలమ్ (158)
![batsmen with highest individual scores in IPL history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338884_3.jpg)
ఐపీఎల్ ప్రారంభ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే అసలు టీ20 బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెక్‌కలమ్. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతనిధ్యం వహించిన ఇతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 73 బంతుల్లోనే 158 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మెక్‌కలమ్ మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 140 పరుగుల తేడాతో విజయం సాధించింది.
డివిలియర్స్ (133)
![batsmen with highest individual scores in IPL history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338884_4.jpeg)
పరిమిత ఓవర్ల క్రికెట్లో తన 360 డిగ్రీ బ్యాటింగ్‌తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్. ఐపీఎల్‌లోనూ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2015లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ ఏబీడీ 59 బంతుల్లో 133 పరుగులు సాధించాడు. ఇందులో 19 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీ (82)తో కలిసి 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కేఎల్ రాహుల్ (132)
![batsmen with highest individual scores in IPL history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338884_5.jpg)
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) సారథి కేఎల్ రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లో 132 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఓ భారతీయ ఆటగాడి వ్యక్తిగత అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఆర్సీబీని 109 పరుగులకే ఆలౌట్ చేసి 97 పరుగులతో విజయం రాహుల్‌సేన.
డివిలియర్స్ (129)
![batsmen with highest individual scores in IPL history](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338884_6.jpg)
ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో టాప్-5లో రెండుసార్లు నిలిచాడు దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఏబీడీ 2016 సీజన్లో భాగంగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 129 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కూడా సెంచరీ (109) సాధించాడు. వీరిద్దరి విధ్వంసం కారణంగా ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు భారీ స్కోర్ సాధించింది. తర్వాత గుజరాత్‌ను 104 పరుగులుకే కట్టడి చేసిన కోహ్లీసేన 144 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇవీ చూడండి: ఐపీఎల్: లీగ్‌లో అత్యధిక వికెట్ల వీరులు!