ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. 2016 తర్వాత తొలిసారి 50 పరుగుల మైలురాయిని అధిగమించాడు గమనార్హం.
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ (59: 41 బంతుల్లో) దుమ్ము రేపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాపాడుకోగల స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అతడు అర్ధశతకం చేయడం వల్లే కోహ్లీసేన కనీసం 149 పరుగులైనా చేసింది. లేదంటే 100కే పరిమితమయ్యేదేమో! క్రీజులోకి వచ్చిన కాసేపు అతడు నెమ్మదిగా ఆడాడు. ఎదుర్కొన్న 16 బంతుల్లో చేసింది 9 పరుగులే. భారీ షాట్లకు ప్రయత్నించినా హైదరాబాద్ బౌలర్లు అడ్డుకున్నారు.
షాబాజ్ నదీమ్ వచ్చాక మ్యాక్సీ విరుచుకుపడ్డాడు. వరుసగా 6, 4, 6 బాదేశాడు. కోహ్లీ, డివిలియర్స్ ఔటైనా మరో 6 ఓవర్లు ఉండటం వల్ల ఆఖరి వరకు ఆడాడు. చివరి ఓవర్లో స్ట్రైక్ కోసం రెండో బంతికి సింగిల్ నిరాకరించాడు. మూడో బంతికి 2 పరుగులు తీసి లీగ్‌లో 2016 తర్వాత తొలి అర్ధశతకం సాధించాడు. 40 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇతడు హాఫ్ సెంచరీ చేయడం విశేషం.
2016 సీజన్లో పంజాబ్‌కు ఆడిన మ్యాక్సీ కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులు చేశాడు. 2017లో 14 మ్యాచ్‌లు ఆడి, 310 పరుగులు చేసినా అత్యధిక స్కోరు మాత్రం 47. తర్వాతి సీజన్లో అతడు దిల్లీకి మారాడు. 12 మ్యాచుల్లో 169 పరుగులు చేశాడు. 2019లో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 2020లో తన పాత ఫ్రాంచైజీ పంజాబ్‌కు చేరుకున్నాడు. గతేడాది 13 మ్యాచుల్లో 108 పరుగులే చేశాడు. అప్పటి అత్యధిక స్కోరు 32. ఆ సీజన్లో అతడు కనీసం ఒక్క సిక్సర్ కూడా కొట్టకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు బెంగళూరు తరఫున వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 39, 59 పరుగులు చేశాడు.