పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. 107 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో ఛేదించి 6 వికెట్ల తేడాతో సునాయాస విజయం సొంతం చేసుకుంది. మొయిన్ అలీ (46), డుప్లెసిస్ (36) ఆకట్టుకునే ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
లక్ష్య ఛేదనలో ఓపెనర్ రుతురాజ్ (5) వికెట్‌ను తొందరగానే కోల్పోయింది చెన్నై. కానీ తర్వాత డుప్లెసిస్‌తో కలిసి మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించి విజయాన్ని సునాయాసం చేశాడు మొయిన్ అలీ. 31 బంతుల్లో 46 పరుగులు చేసి ఇతడు ఔటైన తర్వాత ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. 8 పరుగులు చేస్తే విజయం వరిస్తుందనగా వరుస బంతుల్లో రైనా (8), రాయుడు (0) వికెట్లను కోల్పోయింది సీఎస్కే. కానీ చివర్లో సామ్ కరన్ ఫోర్‌తో జట్టుకు విజయాన్నందించాడు.
తడబడిన పంజాబ్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మయాంక్ అగర్వాల్(1) వికెట్ కోల్పోయింది. అద్భుత ఔట్ స్వింగర్‌తో ఇతడిని బోల్తా కొట్టించాడు దీపక్ చాహర్. తర్వాత కెప్టెన్ రాహుల్ (5) రనౌట్‌గా వెనుదిరిగాడు. గేల్, రాహుల్ వికెట్ల మధ్య సమన్వయ లోపంతో తడబడగా వికెట్లను నేరుగా గిరాటేసి అద్భుత ఫీల్డింగ్‌తో రాహుల్‌ను పెవిలియన్ చేర్చాడు జడేజా. తర్వాత దీపక్ బౌలింగ్‌లో గేల్ (10) జడేజా అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. అనంతరం అదే ఓవర్లో నికోలస్ పూరన్ (0)ను కూడా ఔట్ చేసిన దీపక్, మరో ఓవర్లో దీపక్ హుడా (10)ను పెవిలియన్ చేర్చి సీఎస్కే శిబిరంలో ఆనందంనింపాడు.
ప్రధాన బ్యాట్స్‌మెన్ ఔటైనా కూడా షారుఖ్ ఖాన్ (47) అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్ని పంజాబ్ గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. చివరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి సామ్ కరన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది పంజాబ్.